ఎల్డీఎఫ్ కూటమిని అయ్యప్ప స్వామి దీవిస్తాడు : కేరళ సీఎం విజయన్
కేరళ రాష్ట్ర శాసనసభ ఎన్నికల ప్రక్రియలో భాగంగా మంగళవారం ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ జరుగుతోంది. ఈ ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకున్న కేరళ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్ మాట్లాడుతూ.. లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ (ఎల్డీఎఫ్)తోనే ఈ నేల దేవుళ్లు ఉన్నారని, శబరిమల అయ్యప్పస్వామి ఎల్డీఎఫ్ కూటమిని దీవిస్తారన్నారు.
కన్నూరు జిల్లాలోని ధర్మదం నియోజకవర్గంలో ఓ స్కూల్‌లో ఓటు వేసిన పినరయి విజయన్‌ను ఓ జర్నలిస్టు ప్రశ్నించారు. ఎల్డీఎఫ్‌పై అయ్యప్ప అగ్రహం ఉంటుందని నాయర్ సంఘం నేత సుకుమారన్ నాయర్ చేసిన ఆరోపణలపై స్పందించాలని కోరారు. ఈ నేపథ్యంలో సీఎం విజయన్ స్పందిస్తూ.. ఆయన అలా అని ఉండరని, ఎందుకంటే ఆయన అయ్యప్ప భక్తుడు అని, అయ్యప్పతో పాటు ఈనేలపై ఉన్న ఇతర మతవిశ్వాసాలకు చెందిన దేవుళ్లు కూడా ఎల్డీఎఫ్ ప్రభుత్వాన్ని దీవిస్తారన్నారు.
తమ ప్రభుత్వం ప్రజలను రక్షిస్తోందని, ప్రజలకు మంచి చేసే వారి పట్ల దేవుళ్లు అండగా ఉంటారని సీఎం విజయన్ తెలిపారు. ఇవాళ జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో తమదే విజయం అవుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
ఎన్నికల రోజున అయ్యప్పస్వామి పేరును ప్రస్తావించిన సీఎం విజయన్ తీరును కాంగ్రెస్ పార్టీ ఖండించింది. సీఎం విజయన్ అయ్యప్ప పేరును ప్రస్తావించినా.. ఆ పార్టీ గెలుపుపై ఆశలు లేవని కాంగ్రెస్ నేత వీ మురళీధరన్ అన్నారు. ప్రజలు తమకు వ్యతిరేకంగా ఓటేస్తారన్న భయంతోనే సీఎం విజయన్ అలా మాట్లాడారని మరో నేత ఓమన్ చాందీ ఆరోపించారు.