శనివారం, 4 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్

మెరిసిన అదృష్టం : లీజుకు తీసుకున్న పొలంలో రైతుకు విలువైన వజ్రం

diamond
మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఓ రైతును అదృష్టదేవత వెతుక్కుంటూ వచ్చింది. ఆ రైతు లీజు (కౌలు)కు తీసుకున్న భూమిలో రూ.50 లక్షల విలువ చేసే వజ్రం ఒకటి లభించింది. 11.88 క్యారెట్ల బరువు కలిగివున్న వజ్రం లభించింది. ఈ వజ్రాన్ని ఆ రైతు ప్రభుత్వాధికారులకు అప్పగించి తన నిజాయితీని చాటుకున్నారు. దీంతో ప్రభుత్వ అధికారులు కూడా ఈ వజ్రాన్ని వేలం వేసి పన్నులు వంటి రాయల్టీ సొమ్మును మినహాయించుకుని మిగిలిన సొమ్మును రైతుకు అందచేయనున్నారు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని పన్నా జిల్లాకు చెందిన ప్రతాప్సింగ్ అనే రైతు మరో వ్యక్తి వద్ద కొంత భూమిని లీజుకు తీసుకుని గత మూడు నెలలుగా వజ్రాల కోసం తవ్వుతున్నాడు. ఆయన కష్టానికి ప్రతిఫలం దక్కింది. ఆయనకు 11.88 క్యారెట్ల బరువుండే వజ్రం ఒకటి దొరికింది. ఈ విషయాన్ని వజ్రాల కార్యాలయం అధికారి రవి పటేల్ వెల్లడించారు. ఈ వజ్రం ఎంతో నాణ్యంగా ఉందని ఆయన చెప్పారు. 
 
దీనిపై ప్రతాప్ సింగ్ మాట్లాడుతూ, మూడు నెలల కష్టానికి దేవుడు ఇచ్చిన ప్రతిఫలం అని, ఈ వజ్రాన్ని విక్రయించి, ప్రభుత్వం ఇచ్చే సొమ్ముతో ఏదేనా వ్యాపారం చేస్తానని తెలిపారు. అలాగే, తన పిల్లల చదువుల కోసం కొంత ఖర్చు చేస్తానని వెల్లించారు.