మందుబాటిళ్లపై "తాగి వాహనాలు నడపవద్దు" హెచ్చరిక
ఇప్పటివరకు మద్యం బాటిళ్లపై "మద్యం తాగడం ఆరోగ్యానికి హానికరం" అనే ట్యాగ్ మాత్రమే ఉంది. అయితే మద్యం తాగి వాహనాలు నడపడం వల్ల ప్రమాదాలు ఎక్కువగా జరుగుతుండటంతో ఈ ట్యాగ్‌ను మరింత పొడిగించాలని భావిస్తోంది మహారాష్ట్ర సర్కార్. ఈ మేరకు మహారాష్ట్ర ప్రభుత్వం చట్టబద్ధమైన హెచ్చరిక జారీ చేసింది.
మహారాష్ట్ర ఎక్సైజ్ శాఖ జారీ చేసిన చట్టబద్ధమైన హెచ్చరికలో ఇక నుండి మద్యం బాటిళ్లపైన "మద్యం త్రాగడం ఆరోగ్యానికి హానికరం. మద్యం త్రాగకుండా సురక్షితంగా ఉండండి. మద్యం త్రాగి వాహనాలు నడపవద్దు" అని ముద్రించమని ఆదేశాలు జారీ చేసారు. మద్యం, బీరు బాటిళ్లపై ఈ హెచ్చరికను మరాఠీ భాషలో ముద్రించాలని మద్యం తయారీ సంస్థలను మహారాష్ట్ర సర్కారు ఆదేశించింది.
ఏప్రిల్ 1వ తేదీ నుండి బయటకు వచ్చే మద్యం బాటిళ్ల లేబుల్‌లపై తప్పనిసరిగా ఈ హెచ్చరిక ఉండాలని ఆదేశించింది. ఈ హెచ్చరికను బాగా కనిపించే విధంగా పెద్ద అక్షరాల్లో ముద్రించాలని కూడా పేర్కొనడం విశేషం.