మంగళవారం, 14 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 5 మే 2021 (14:55 IST)

యోగా టీచర్‌తో అక్రమ సంబంధం... చంపేసి బాత్రూమ్‌లో పాతిపెట్టిన లాయర్!

ఆయన ఓ లాయర్. ఆమె ఓ యోగా టీచర్. వీరిద్దరూ వివాహితులే. కానీ, లాయర్ భార్యకు దూరంగా, యోగా టీచర్ భర్తకు దూరంగా ఉంటున్నారు. అలా ఒంటరిగా జీవిస్తున్న వీరిద్దరినీ ఆ ఒంటరితనమే కలిపింది. ఒకరిని ఒకరు ఇష్టపడ్డారు. ప్రేమించుకున్నారు. ఇద్దరూ సుఖజీవితాన్ని గడుపుతూ వచ్చారు. ఇంతలో ఏమైందో తెలియదుగాని తన ప్రియురాలిని లాయర్ చంపేసి, బాత్రూమ్‌లో పూడ్చిపెట్టాడు. ఈ దారుణం తమిళనాడు రాష్ట్రంలో వెలుగూ చూసింది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, మదురైకు చెందిన హ‌రికృష్ణ‌న్(40) అనే వ్యక్తి కొన్నేళ్ళుగా భార్య‌కు దూరంగా ఉంటున్నాడు. ఈయన వద్ద పదేళ్ళ కుమార్తె మాత్రం ఉంటోంది. ఈ క్ర‌మంలో హ‌రికృష్ణ‌న్‌కు యోగా టీచ‌ర్ చిత్ర‌దేవీ (36) ప‌రిచ‌య‌మైంది. ఆమె కూడా భ‌ర్త‌కు దూరంగా ఉంటుంది. దీంతో హ‌రికృష్ణ‌న్, యోగా టీచ‌ర్ మ‌ధ్య ఏర్ప‌డిన ప‌రిచ‌యం.. ప్రేమ‌కు దారి తీసింది.
 
అయితే ఏప్రిల్ 2న చిత్ర‌దేవీ అదృశ్య‌మైన‌ట్లు ఆమె తండ్రి క‌న్న‌య్య పోలీసుల‌కు 5వ తేదీన‌ ఫిర్యాదు చేశాడు. కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు. ఇక తండ్రి క‌న్న‌య్య‌.. చిత్ర‌దేవీ, హ‌రికృష్ణ‌న్ మ‌ధ్య జ‌రిగిన ఫోన్ కాల్ సంభాష‌ణ‌ను సంపాదించి పోలీసుల‌కు స‌మ‌ర్పించాడు. ఈ క్ర‌మంలో హ‌రికృష్ణ‌న్ మంగ‌ళ‌వారం త‌న ఇంట్లోనే ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడు.
 
పోలీసులు అక్క‌డికి చేరుకుని ప‌రిశీలించ‌గా, సూసైడ్ నోట్ ల‌భ్య‌మైంది. చిత్ర‌దేవీని తానే హ‌త్య చేశాన‌ని, త‌న ఇంట్లోని బాత్రూమ్‌లో పూడ్చిపెట్టాన‌ని సూసైడ్ నోట్‌లో పేర్కొన్నాడు లాయ‌ర్. ఆమెను చంపాన‌న్న బాధ భ‌రించ‌లేక‌నే తాను ఆత్మ‌హ‌త్య చేసుకుంటున్న‌ట్టు తెలిపాడు. మొత్తానికి ఈ ఘ‌ట‌న‌పై పోలీసులు విస్తృతంగా ద‌ర్యాప్తు చేస్తున్నారు. అయితే, ప్రియురాలిని చంపడానికి గల కారణాలు మాత్రం వెల్లడించలేదు.