శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 20 ఏప్రియల్ 2021 (13:24 IST)

నిలకడగా మాజీ ప్రధాని మన్మోహన్ ఆరోగ్యం : హర్షవర్థన్

కరోనా వైరస్ సోకి, ఎయిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ తెలిపారు. స్వల్ప జ్వరంతో సోమవారం మన్మోహన్ సింగ్ ఎయిమ్స్‌లో చేరిన సంగతి తెలిసిందే. 
 
ఈ నేపథ్యంలో ఆయన ఆరోగ్యంపై హర్షవర్ధన్ మంగళవారం ఒక హెల్త్ బులిటెన్ విడుదల చేశారు. మన్మోహన్‌కు మెరుగైన వైద్యం అందిస్తున్నామన్నారు. ఆయనకు ఇస్తున్న చికిత్సపై ఎప్పటికప్పుడు ఎయిమ్స్ వైద్యులతో చర్చిస్తున్నట్టు తెలిపారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం బాగానే ఉందన్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. 
 
కాగా, మంగళవారం సాయంత్రం 5 గంటల సమయంలో మన్మోహన్ ఎయిమ్స్‌లో చేరారు. ముందు జాగ్రత్తగా కరోనా టెస్ట్ చేశారు. అంతకుముందు ఆయన రెండు డోసుల కొవాగ్జిన్ టీకా తీసుకున్నారు. అయితే, జ్వరం వచ్చిన నేపథ్యంలో ముందు జాగ్రత్తగానే ఆయన ఆసుపత్రిలో చేరారని అధికార వర్గాలు ప్రకటించాయి.