శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : శనివారం, 26 జులై 2014 (13:16 IST)

రెచ్చిపోతున్న గోవా మంత్రులు: కామెంట్స్‌తో సెగ!

ముఖ్యమంత్రి సహా ఇతర గోవా మంత్రులు ఇటీవల తమ వ్యాఖ్యలతో సెగ పుట్టిస్తున్నారు. ముఖ్యంగా ధవాలికర్ సోదరులైతే భారతీయ సంస్కృతిని పరిరక్షించడానికే పుట్టినట్టు మాట్లాడుతున్నారు. ఒకరు బికినీలపై నిషేధం విధించాలంటారు, మరొకరు మోడీ నాయకత్వంలో భారతదేశం 'హిందుత్వ' దిశగా సాగిపోవాలనుందని ఆకాంక్షిస్తారు. తాజాగా డిప్యూటీ సీఎం ఫ్రాన్సిస్ డిసౌజా వీరికి జతకలిశారు. ఆయన మరో అడుగు ముందుకేసి భారతీయులంతా హిందువులేనని ఓ అమూల్య అభిప్రాయం వెలిబుచ్చారు. తాను క్రిస్టియన్ హిందువునంటూ ఓ సరికొత్త కేటగిరీని సృష్టించేశారు.
 
పనాజీలో ఆయన మాట్లాడుతూ, భారత్ ఓ హిందూ దేశామని తెలిపారు. ఇక్కడ ఉండేవారందరూ హిందువులే అని చెప్పడంలో సందేహం వలదన్నారు. ఇక ప్రత్యేకంగా భారత్ ను హిందూ దేశంగా మార్చాల్సిన అవసరం లేదన్నారు. భారత్ ఎల్లప్పుడూ హిందూ దేశమేనని, హిందూ దేశంగానే నిలబడుతుందని ధీమాగా చెప్పారు. పీడబ్ల్యూడీ మంత్రి పాండురంగ సుదిన్ ధవాలికర్ బికినీ వ్యాఖ్యలపైనా ఆయన విశ్లేషణ చేశారండోయ్. మనది స్వేచ్ఛాదేశమని... ఏ అంశాన్నైనా వివాదస్పదం చేసుకునే స్వేచ్ఛ ప్రతి ఒక్కరికీ ఉంటుందని సెలవిచ్చారు. 
 
"నా అభిప్రాయాన్ని నేను చెబుతాను, ఆయన అభిప్రాయం ఆయన చెబుతారు, మనది ప్రజాస్వామ్య దేశం కదా?" అని డిసౌజా సూత్రీకరించారు. ఏదేమైనా ఇటీవల కొన్ని రోజులుగా గోవా మంత్రులు చేస్తున్న వ్యాఖ్యలపై సామాజికవేత్తలు మండిపడుతున్నారు.