1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 11 డిశెంబరు 2023 (18:42 IST)

శివరాజ్ సింగ్ చౌహాన్‌కు మొండిచేయి.. మధ్యప్రదేశ్ కొత్త సీఎంగా మోహన్ యాదవ్

mohan yadav
మధ్యప్రదేశ్ రాష్ట్ర కొత్త ముఖ్యమంత్రిగా మోహన్ యాదవ్ పేరును భారతీయ జనతా పార్టీ పెద్దలు ఖరారు చేశారు. ఇప్పటివరకు నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా ఉన్న శివరాజ్ సింగ్ చౌహాన్‌కు కమలనాథులు మొండిచేయి చూపించారు. ఇటీవల వెల్లడైన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో విజయభేరీ మోగించిన విషయం తెల్సిందే. తెలంగాణ, మిజోరం రాష్ట్రాల్లో ఆ పార్టీ ఏమాత్రం ప్రభావం చూపించలేక పోయింది. 
 
ఈ నేపథ్యంలో ఈ మూడు రాష్ట్రాలకు కొత్త ముఖ్యమంత్రులను ఎంపిక చేయడంలో కమలనాథులు దృష్టిసారించారు. ఇందులోభాగంగా, ఛత్తీస్‌గఢ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆదివాసీ నేత విష్ణు డియో సాయి పేరును ఆదివారం ఖరారు చేసింది. సోమవారం నాడు మధ్యప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మోహన్ యాదవ్‌ను ఎంపిక చేసింది. అలాగే, ఉప ముఖ్యమంత్రిగా జగదీశ్ దేవ్ డా వ్యవహరిస్తారని బీజేపీ కేంద్ర పార్టీ కార్యాలయం విడుదల చేసిన ఓ పత్రికా ప్రకటనలో పేర్కొంది. 
 
58 యేళ్ళ మోహన్ యాదవ్... తాజా ఎన్నికల్లో ఉజ్జయిని దక్షిణ అసెంబ్లీ స్థానం నుంచి గెలిచారు. ఇప్పటివరకు నాలుగు పర్యాయాలుగా సీఎంగా ఉన్న శివరాజ్ సింగ్ చౌహాన్‌ స్థానంలో మోహన్ యాదవ్‌ను ఎంపిక చేసింది. ఎంపీలో ప్రముఖ వ్యాపారవేత్తగా ఉన్న మోహన్ యాదవ్ గత 2013లో రాజకీయాల్లోకి వచ్చారు. ఆ ఎన్నికల్లో గెలిచి తొలిసారి అసెంబ్లీకి అడుగుపెట్టిన ఆయన.. 2018లో జరిగిన ఎన్నికల్లో కూడా గెలుపొంది, 2020లో ఏర్పాటైన శివరాజ్ సింగ్ చౌహాన్ మంత్రివర్గంలో మంత్రిగా బాధ్యతలు చేపట్టారు.