ముంబైలో మూతపడిన ప్రఖ్యాత కరాచీ బేకరీ!
దేశ ఆర్థిక రాజధాని ముంబై మహానగరంలోని బంద్రా ఏరియాలో ఉన్న ప్రఖ్యాత బేకరీ షాపుల్లో ఒటైన కరాచీ బేకరీ మూతపడింది. ఈ బేకరీ షాపు లైసెన్స్ గడువు తీరిపోవడంతో కరాచీ బేకరీ మూతపడింది. అయితే, మహారాష్ట్ర నవ నిర్మాణ సేన (ఎంఎన్ఎస్) కార్యకర్తలు మాత్రమే.. తమ వల్లే బేకరీ మూతడిందంటూ క్రెడిట్ తీసుకుంది.
కానీ, లీజు గడువు ముగియడం వల్లే మూసివేయాల్సి వచ్చిందని బేకరీ మేనేజర్ రామేశ్వర్ వాగ్‌మరే చెబుతున్నారు. పాకిస్థాన్‌లోని ప్రముఖ నగరమైన కరాచీ పేరు ఈ బేకరీకి ఉండటంపై ఎంఎన్ఎస్ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ బేకరీని మూసేయాలని ఆందోళన చేసింది. ఇప్పుడు తమ ఆందోళన వల్లే ఈ బేకరీ మూత పడిందని ఆ పార్టీ ఉపాధ్యక్షుడు హజీ సైఫ్ షేక్ ట్వీట్ చేశారు.
అయితే లీజు ఒప్పందం ముగిసిందని, కొత్తగా లీజుకు ఇవ్వాలంటే ఓనర్ భారీ మొత్తం డిమాండ్ చేస్తుండటంతో అది ఇష్టం లేకే బేకరీని మూసేశామని మేనేజర్ రామేశ్వర్ వాగ్‌మరే చెప్పారు. ఇప్పటికే గతేడాది లాక్డౌన్ వల్ల తమ బిజినెస్ దెబ్బతిన్నదని ఆయన తెలిపారు. తమ బేకరీ పేరు మార్చాల్సిన అవసరం లేదని, తమది లైసెన్స్ ఉన్న చట్టబద్ధమైన బిజినెస్ అని వాగ్‌మరే స్పష్టం చేశారు. ఈ బేకరీ మూతపడటంతో ఆయనతోపాటు ఇతర ఉద్యోగులు కూడా ఇప్పుడు నిరుద్యోగులుగా మిగిలారు.
ఈ బేకరీ పాకిస్థానీయులదా?
నిజానికి హైదరాబాద్‌కు చెందిన ఈ కరాచీ బేకరీ ఓ సింధీ హిందూ కుటుంబానికి చెందినది. దేశ విభజన తర్వాత పాకిస్థాన్‌లోని కరాచీ నుంచి వలస వచ్చిన రమ్నానీ కుటుంబం ఈ బేకరీని నడుపుతోంది. అయితే మొదటి నుంచీ ఈ పేరుపై ఏదో ఒక వివాదం నడుస్తూనే ఉంది. గతేడాది నవంబర్‌లో ఎంఎన్ఎస్ వైస్ ప్రెసిడెంట్ షేక్.. ఈ బేకరీకి ఓ లీగల్ నోటీసు పంపించారు.
కరాచీ అనే పేరు భారతీయుల మనోభావాలను దెబ్బతీస్తోందని ఆయన అందులో చెప్పారు. బేకరీ తన పేరు మార్చి.. మరాఠీలో ఆ పేరును రాయాలని డిమాండ్ చేశారు. అయితే ఈ బేకరీని ఓ సింధీ - హిందు కుటుంబమే నెలకొల్పిందని, ఈ పేరు ఇప్పుడు అంతర్జాతీయంగా ప్రఖ్యాతిగాంచిందని ఆ బేకరీ సమాధానమిచ్చింది.