సోమవారం, 25 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 2 ఫిబ్రవరి 2022 (22:04 IST)

జాతీయ గీతానికి అవమానం... సీఎం మమతా బెనర్జీకి కోర్టు సమన్లు

వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ గతేడాది ముంబైకి వచ్చినప్పుడు జాతీయ గీతాన్ని అవమానించారంటూ బీజేపీ కార్యనిర్వాహక అధికారి వివేకానంద్ గుప్తా మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీన్ని విచారణకు స్వీకరించిన కోర్టు ఇపుడు ఆమెకు సమన్లు జారీచేసింది. మార్చి 2వ తేదీన వ్యక్తిగతంగా హాజరు కావాలంటూ అందులో ఆదేశించింది. 
 
గత యేడాది ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు మమతా బెనర్జీ ముంబైకు వచ్చారు. అపుడు జాతీయ గీతం ఆలపించే సమయంలో ఆమె నిలబడకుండా వెళ్లిపోయారు. ఇలా జాతీయ గీతాన్ని అవమానించారంటూ వివేకానంద గుప్తా ఆరోపిస్తున్నారు. 
 
ఈ కేసులో మమత బెనర్జీపై (ఎఫ్‌ఐఆర్) నమోదు చేసేలా ఆదేశించాలని పిటిషన్‌లో కోరారు. జాతీయ గీతం పాడుతున్నపుడు లేదా ఆలపించేటప్పుడు ప్రతి ఒక్కరూ లేచి నిలబడాలని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆదేశాలు స్పష్టంగా ఉన్నాయన్నారు. కానీ, మమతా బెనర్జీ వీటిని ధిక్కరించారని పేర్కొన్నారు. 
 
ఈ కేసు విచారణ బుధవారం జరుగగా, విచారణకు వ్యక్తిగతంగా హాజరు కావాలని బెనర్జీని కోర్టు ఆదేశించింది. మమత ముఖ్యమంత్రి అయినప్పటికీ, ఆమె తన అధికారిక విధిని నిర్వర్తించనందున ఆమెపై విచారణకు ఎటువంటి ఆటంకం లేదని కోర్టు పేర్కొంది. 
 
ఫిర్యాదు, పిటిషనర్‌ అబ్జర్వేషన్ రిపోర్టు, డీవీడీలోని వీడియో క్లిప్‌, యూట్యూబ్‌ లింక్‌లోని వీడియో క్లిప్‌ను పరిశీలించిన తర్వాత నిందితులు జాతీయ గీతం ఆలపించి అకస్మాత్తుగా వేదిక నుంచి వెళ్లిపోయినట్లు తెలుస్తోందని కోర్టు దృష్టికి తెచ్చారు.