చికెన్ గ్రేవీ కాదు.. అది ఎలుక గ్రేవీ.. ముంబై రెస్టారెంట్‌లో..?
రెస్టారెంటుకు డిన్నర్ టేస్ట్ చేద్దామని వెళ్లిన ముంబై వ్యక్తికి చేదు అనుభవం ఎదురైంది. ఎందుకంటే ఆ ముంబై వ్యక్తి ఆర్డర్ చేసిన చికెన్ కర్రీలో ఎలుకను కనుగొన్నాడు. ఇందుకు సదరు హోటల్ అస్పష్టమైన సమాధానాలు ఇచ్చింది.
ప్రస్తుతం ఎలుకను గ్రేవీతో కప్పి ఉంచిన చిత్రాలను సదరు వ్యక్తి నెట్టింట షేర్ చేశాడు. వివరాల్లోకి వెళితే.. ముంబై రెస్టారెంట్‌లో ఆదివారం కోడి కూర విందు కస్టమర్‌కు భయానక అనుభవంగా మారింది.
కొంచెం వింతగా అనిపించే మాంసం నిజానికి చనిపోయిన ఎలుక అని అతను కనుగొన్నాడు. రెస్టారెంట్ మేనేజర్, చెఫ్‌పై అభియోగాలు మోపినట్లు పోలీసులు బుధవారం తెలిపారు. అనురాగ్ సింగ్, అతని స్నేహితుడు అమీన్ ఆదివారం రాత్రి పంజాబీ ఫుడ్ కోసం బాంద్రాలోని ఒక హోటల్‌కు వెళ్లారు.
టేబుల్‌కు ఆర్డరిచ్చిన చికెన్ గ్రేవీ రావడంతో అనురాగ్ తినడం ప్రారంభించాడు. కానీ అతను మాంసం ముక్కను నమిలినప్పుడు, అది చికెన్ కాదనే అనుమానం వచ్చింది. నిశితంగా పరిశీలించగా, అది చనిపోయిన ఎలుక అని కనుగొన్నాడు.
దీంతో అనురాగ్ అతని స్నేహితుడు కోపంతో ఊగిపోయారు. ఇందుకు హోటల్ మేనేజర్ సరైన సమాధానం ఇవ్వలేదు. దీంతో అనురాగ్ సింగ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆ ఫుడ్ తీసుకున్న వెంటనే తాను అస్వస్థతకు గురయ్యానని, డాక్టర్‌ని కలవాల్సి వచ్చిందని ఫిర్యాదు చేశాడు.
ఈ ఘటనపై హోటల్ చెఫ్, మేనేజర్, చికెన్ సరఫరాదారుపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆహారంలో కల్తీ చేయడం, ఇతరుల ప్రాణాలకు లేదా వ్యక్తిగత భద్రతకు హాని కలిగించడం వంటి నేరాలకు వారిపై అభియోగాలు మోపినట్లు పోలీసులు తెలిపారు.