మైనర్ అయినా ఫర్లేదు.. రజస్వల అయితే చాలు పెళ్లి చేసుకోవచ్చు...
పంజాబ్ - హర్యానా ఉమ్మడి హైకోర్టు మైనర్ బాలికల వివాహాలప కీలక రూలింగ్ ఇచ్చింది. ఇస్లాం చట్టం ప్రకారం యుక్త వయసు మైనర్ ముస్లిం బాలిక తన ఇష్టం మేరకు పెళ్లి చేసుకునే హక్కు ఉందని హైకోర్టు తీర్పునిచ్చింది. ఈ సందర్భంగా ఇస్లామిక్ చట్టంలోని ఆర్టికల్ 195ని ప్రస్తావించింది. పంజాబ్‌కు చెందిన ఓ ముస్లిం జంట వేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన జస్టిస్ అల్కా సరిన్ ఈ మేరకు ఓ వివాదాస్పద తీర్పును వెలువరించారు.
పునరుత్పత్తి దశకు రాని మైనర్లు వాళ్ల గార్డియన్ల ద్వారా వివాహ బంధంలోకి అడుగుపెట్టవచ్చు. యుక్త వయసు మైనర్లు మాత్రం తమ ఇష్టం మేరకు గార్డియన్ అనుమతి ఉన్నా లేకపోయినా పెళ్లి చేసుకోవచ్చు అని ఆ ఆర్టికల్‌లో చెప్పిన విషయాన్ని ఈ సందర్భంగా కోర్టు ప్రస్తావించింది.
37 ఏళ్ల వ్యక్తి, 17 ఏళ్ల అమ్మాయి గత నెల 21న పెళ్లి చేసుకున్నారు. అయితే వాళ్ల పెళ్లి ఇష్టం లేని కుటుంబ సభ్యులు తమను బెదిరిస్తున్నారని, వాళ్ల నుంచి రక్షణ కల్పించాలని ఈ జంట కోర్టును ఆశ్రయించింది. అమ్మాయి మైనర్ అయినా కూడా ఇస్లామిక్ చట్టం ప్రకారం ఈ పెళ్లి చెల్లుతుందని తీర్పు చెప్పిన కోర్టు.. వాళ్లకు రక్షణ కల్పించాలని మొహాలీ ఎస్ఎస్‌పీని ఆదేశించింది.