శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : ఆదివారం, 7 ఫిబ్రవరి 2016 (15:24 IST)

ఆ కాఫీకి ఫిదా అయిపోయా.. ఈ కాఫీగింజలు పండే ప్రాంతం ఎక్కడ ఉంది.. : ప్రధాని మోడీ

అరకు కాఫీ రుచికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఫిదా అయ్యారు. కాఫీ అమోఘంగా ఉందంటూ ప్రశంసలు కురిపించారు. ఏయూ ఇంజనీరింగ్‌ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన మారిటైమ్‌ ఎగ్జిబిషన్‌ను, ఐఎఫ్‌ఆర్‌ గ్రామాన్ని గవర్నర్‌ నరసింహన్‌, సీఎం చంద్రబాబుతో కలిసి శనివారం సాయంత్రం ప్రధాని సందర్శించారు. 
 
ఈ సందర్భంగా అరకు కాఫీ స్టాల్‌ వద్ద నిర్వాహకులు వారికి కాఫీ అందించారు. కాఫీ రుచి చూసిన వెంటనే... 'చాలా బాగుంది. ఈ కాఫీ పండే ప్రాంతం ఎక్కడ ఉంది?' అంటూ పక్కనే ఉన్న ఏపీ సీఎం చంద్రబాబు నాయుడిని మోడీ అడిగారు. విశాఖ జిల్లాలోనే అరకు లోయ ప్రాంతంలో పండిస్తున్నట్టు చంద్రబాబు చెప్పారు. అరకు కాఫీ రుచి, దాని ప్రత్యేకతలు బయటి ప్రపంచానికి తెలుసా? అని ప్రధాని ప్రశ్నించగా.. 'ఇప్పుడిప్పుడే ప్రచారం చేస్తున్నాం. ఈ బాధ్యతను గిరిజన కార్పొరేషన్ చేపట్టింది' అని సీఎం సలహాదారు కృష్ణారావు తెలిపారు. 
 
ఈ పంట ఎవరు పండిస్తున్నారని ప్రధాని ప్రశ్నించగా... ఏజెన్సీ ప్రాంతంలో ఏడు మండలాలకు చెందిన లక్ష మంది గిరిజనులు పండిస్తున్నారని కృష్ణారావు చెప్పారు. విదేశాలకు ఎగుమతి అవుతోందా అని అడగ్గా... ఈ కాఫీని జీసీసీ అంతర్జాతీయ స్థాయిలో మార్కెటింగ్‌ చేస్తోందని, ఇప్పుడిప్పుడే ఆదరణ పెరుగుతుందని వివరించారు. ఈ సందర్భంగా జీసీసీ ఉత్పత్తులను ప్రధానికి చూపించారు. ప్రధాని తదితరులు సుమారు 20 నిమిషాలపాటు అరకు కాఫీ స్టాల్‌ వద్ద గడపడం విశేషం.