పైసా పెట్టుబడి వద్దని నమ్మించాడు.. రూ.47 లక్షలు దోచుకున్నాడు... ఎలా?

సందీప్ రేవిళ్ల| Last Updated: గురువారం, 28 ఫిబ్రవరి 2019 (17:36 IST)
సైబర్ మోసాలను ఎన్ని చూస్తున్నా, ప్రజలు మాత్రం మోసపోతూనే ఉన్నారు. ఇలాగే ఓ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కి టోపీ వేశాడు ఓ నైజీరియన్. హైదరాబాద్‌లో బహుళ జాతి కంపెనీలో పనిచేసున్న ఓ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ మోసపోయింది. దాదాపు 47 లక్షల రూపాయలు స్వాహా చేసినట్లు సమాచారం.

తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, బేగంపేటలో నివాసముంటున్న ఆ యువతి ఐదేళ్ల నుంచి మాదాపూర్‌లోని బహుళ జాతి కంపెనీలో దాదాపు 2 లక్షల జీతంతో పనిచేస్తోంది. నాలుగు నెలల క్రితం ఇన్‌స్టాగ్రామ్‌లో జాన్‌ సీకెల్‌ వ్యక్తిగత వివరాలను చూసింది. అతడు సైనిక విభాగంలో ఇంజనీర్‌గా పనిచేస్తున్నాడని తెలుసుకుని, తనకు సైన్యమన్నా, అధికారులన్నా ఎంతో గౌరవమని అతని ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేశారు.

ఇది అదునుగా భావించిన అతను బాధితురాలికి వాట్సప్ కాల్ చేసి మాట్లాడాడు. అమెరికా సైనిక విభాగంలో పనిచేస్తున్నానని, ప్రస్తుతం లండన్‌లో ఉంటున్నానని నమ్మబలికాడు. అప్పటి నుంచి పరిచయం ఏర్పడి తరచుగా మాట్లాడుకునేవారు. నాకు వస్తున్న జీతం, ఆదాయంతో బహుళ అంతస్థుల భవనాలను నిర్మిస్తున్నాను, మలేసియాలో 24 అంతస్థుల వాణిజ్య సముదాయాన్ని నిర్మిస్తున్నాం. నా తరఫున నిర్మాణ పనులు చేయిస్తున్న జార్జిమార్టిన్‌ భారతదేశంలో మెట్రో నగరాలలో స్థిరాస్తి వ్యాపారం లాభసాటిగా ఉంటుందని చెప్పారు. నేను 25 కోట్ల నుండి 50 కోట్ల దాకా పెట్టుబడి పెట్టబోతున్నాను. హైదరాబాద్‌లో భవన నిర్మాణాలకు అనువుగా ఉండే స్థలాలను చూడు అని మాయమాటలు చెప్పాడు.

గత డిసెంబర్‌లో మూడు స్థలాలు ఉన్నాయని ఆమె చెప్పింది. వాటికి రూ.5 కోట్లు చెల్లిస్తానని, మన స్నేహం కారణంగా మీరు పెట్టుబడి పెట్టకున్నా భాగస్వామిగా ఉండవచ్చునని నమ్మించాడు. జనవరి మొదటి వారంలో యువతికి ఫోన్ చేసి జార్జిమార్టిన్‌ రూ.5 కోట్లు తీసుకువస్తున్నాడని చెప్పాడు. అనుకున్నట్లుగానే జార్జిమార్టిన్‌ ఆమెకు ఫోన్ చేశాడు. తాను ఢిల్లీ విమానాశ్రయానికి వచ్చానని, కస్టమ్స్ సుంకం క్రింద రూ.5 లక్షలు చెల్లించాలని అధికారులు చెప్పారని, తన వద్ద ఇండియన్ కరెన్సీ లేదని, ఇప్పుడు ఇస్తే తిరిగి ఇచ్చేస్తానని చెప్పాడు.

అతను చెప్పిన ఖాతాలోకి ఆమె డబ్బు జమ చేసింది. తర్వాత రోజు ఫోన్‌ చేసి రూ.10 లక్షలు ఆదాయపు పన్ను చెల్లించాల్సి ఉందని చెప్పగా ఆమె రెండు రోజుల్లో ఆ మొత్తాన్ని జాన్‌మార్టిన్‌ చెప్పిన ఖాతాల్లో జమ చేశారు. పనిమీద అత్యవసరంగా మలేసియా వెళ్తున్నానని చెప్పారు. వారంరోజుల తర్వాత, తిరిగి వచ్చానని, ఢిల్లీ నుండి ఫోన్ చేస్తున్నానని చెప్పాడు. స్థిరాస్తి కంపెనీని రిజిస్టర్ చేసేందుకు రూ.15 లక్షలు అవసరమని కోరగా అది కూడా జమచేసింది. కంపెనీ బ్యాంక్ ఖాతాల్లో కనీసం రూ.17 లక్షలు నిల్వ ఉంచాలని చెప్పగా ఆ మొత్తం కూడా బదిలీ చేసింది.

ఆ తర్వాత ఇన్‌స్టాగ్రామ్ ఖాతాని తొలగించాడు. వాట్సప్ కాల్ చేస్తే పనిచేయకపోవడంతో మోసపోయానని గ్రహించిన ఆమె సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు దర్యాప్తు చేసి ఇది ఢిల్లీలోని నైజీరియన్ చేసిన మోసంగా గుర్తించారు. ఇద్దరు వ్యక్తులు లేరని ఒక వ్యక్తే ఇద్దరు వ్యక్తులుగా వ్యవహరించాడని చెప్పారు. ఇందుకోసం తాను రెండు బ్యాంక్‌లలో వ్యక్తిగత రుణం తీసుకున్నానని ఆవేదన వ్యక్తం చేసింది.



దీనిపై మరింత చదవండి :