శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : గురువారం, 26 నవంబరు 2020 (10:00 IST)

తీరం దాటిన 'నివర్‌', తిరులలో విరిగిపడ్డ కొండ చరియలు

తమిళనాడు, పుదుచ్చేరిలను కంటిమీద కునుకులేకుండా చేస్తున్న ‘నివర్‌’ తుపాను తీరం దాటింది.  పుదుచ్చేరికి సమీపంలో తీరం దాటి అతితీవ్ర తుపాను నుంచి తీవ్రతుపానుగా మారింది. బుధవారం రాత్రి 11.30 గంటల నుంచి గురువారం తెల్లవారుజామున 2.30 గంటల మధ్య నివర్‌ తుపాను తీరం దాటినట్లు వాతావరణ శాఖ పేర్కొంది.

ఇప్పటికే తుపాను ప్రభావంతో తమిళనాడులోని పలు ప్రాంతాలు, ఏపీలోని నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి. తుపాను తీరం దాటక గంటకు 120-145 కి.మీల వేగంతో గాలులు వీస్తాయని అధికారులు పేర్కొన్నారు. మరోవైపు  చెన్నై సముద్ర తీర ప్రాంతాలు అల్లకల్లోలంగా మారాయి. నివర్‌ తుపాన్‌ తమిళనాడు, పుదుచ్చేరిలపై తీవ్ర ప్రభావం చూపనుంది. 
 
తుపాను ప్రభావంతో చిత్తూరు, కర్నూలు, ప్రకాశం, కడప జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తున్నాయి. మిగిలిన చోట్ల అక్కడక్కడ మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలు ఉన్నాయి. ఇప్పటికే నెల్లూరు, చిత్తూరు, ప్రకాశం జిల్లాలకు సహాయక చర్యల కోసం 5ఎస్డీఆర్‌ఎప్‌, 4ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు చేరుకున్నాయి.

ఇల్లు సురక్షితం కాకపోతే పునరావాస కేంద్రాలకు ప్రజలు తరలివెళ్లాలని విపత్తలుశాఖ సూచించింది. రైతులు అప్రమత్తంగా ఉండి, పంట సంరక్షణకై తగిన జాగ్రత్తలు తీసుకోవాలని విపత్తుల శాఖ సూచించింది. 
 
తిరుమలలో విరిగిపడ్డ కొండ చరియలు..
నివర్‌ తుపాను కారణంగా తిరుమలలో భారీ వర్షం కురుస్తోంది. తీవ్రంగా వీస్తున్న గాలులకు ఎక్కడికక్కడ చెట్లు నేలకూలుతున్నాయి. తిరుమల కనుమ మార్గంలో కొండచరియలు విరిగిపడ్డాయి. హరిణి ప్రాంతంలో రహదారిపై బండ రాళ్లు పడ్డాయి. జేసీబీల సాయంతో అధికారులు బండరాళ్లను తొలగిస్తున్నారు. మరోవైపు తుపాను దృష్ట్యా ఇవాళ నడవనున్న పలురైళ్లను దక్షిణమధ్య రైల్వే రద్దు చేసింది.