1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్

అయోధ్యపై మహోన్నత తీర్పు... అలా చేయడం అంత తేలిక కాదు : నరేంద్ర మోడీ

అయోధ్యపై సుప్రీంకోర్టు మహోన్నత తీర్పును ఇచ్చిందనీ, అందర్నీ ఒప్పించడం అంత తేలిక కాదని ప్రధాని నరేంద్ర మోడీ వ్యాఖ్యానించారు. అయోధ్య వివాదాస్పద భూమి హిందువులదేనంటూ సుప్రీం కోర్టు చారిత్రాత్మక తీర్పు ఇచ్చిన విషయం తెల్సిందే. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ శనివారం సాయంత్రం దేశ ప్రజలనుద్దేశించి మాట్లాడారు. 
 
సుప్రీం కోర్టు ఇవాళ మహోన్నత తీర్పు ఇచ్చిందని కొనియాడారు. దశాబ్దాలు సాగిన న్యాయప్రక్రియ ఇన్నాళ్లకు ముగిసిందని, సుప్రీం తీర్పును దేశమంతా స్వాగతించిందని అన్నారు. సుప్రీం కోర్టు ఏకగ్రీవంగా తీర్పు ఇచ్చిందని, అందరినీ ఒప్పించడం అంత తేలిక కాదని అభిప్రాయపడ్డారు.
 
ముఖ్యంగా, దేశంలోని అన్ని వర్గాల వాదనలను, అభిప్రాయాలను, సూచనలను సుప్రీం కోర్టు ఎంతో సహనంతో, తెగువతో ఆలకించిందని గుర్తుచేశారు. దేశ న్యాయచరిత్రలో నేడు సువర్ణ అధ్యాయం మొదలైందని, న్యాయమూర్తులు, న్యాయాలయాలకు శుభాభినందనలు అని వ్యాఖ్యానించారు. ఓ దీర్ఘకాలిక సమస్యకు పరిష్కారం లభించిందని, భారతదేశం అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమని ప్రపంచమంతా గుర్తించిందని తెలిపారు.
 
భిన్నత్వంలో ఏకత్వం అనే మంత్రం నేడు సంపూర్ణత్వంతో వికసించిందన్నారు. భారతదేశపు ఈ మూల మంత్రాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకుంటారని మోడీ చెప్పుకొచ్చారు. నవంబరు 9 భారత చరిత్రలో నిలిచిపోయే రోజని, పాకిస్థాన్‌తో సయోధ్యలో భాగంగా కర్తార్‌పూర్ కారిడార్ ప్రారంభమైందని, మరోవైపు అయోధ్య అంశంలో చారిత్రాత్మక తీర్పు వచ్చిందని ప్రధాని మోడి గుర్తుచేశారు.