శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By
Last Updated : ఆదివారం, 4 ఆగస్టు 2019 (10:51 IST)

కాశ్మీర్ అంతా ప్రశాంతమే... ప్రజల్ని భయపెట్టొద్దు : సత్యపాల్‌ మాలిక్‌

కాశ్మీర్‌ అంతా ప్రశాంతంగా ఉందనీ, ప్రజల్నీ భయపెట్టొద్దని జమ్మూకాశ్మీర్ గవర్నర్ సత్యపాల్ మాలిక్ కోరారు. ప్రస్తుతం కాశ్మీర్‌లో ఉద్రిక్త వాతావరణ పరిస్థితులు నెలకొన్న విషయం తెల్సిందే. దీనిపై ఆయన స్పందిస్తూ, జమ్ముకాశ్మీర్ ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, భద్రతా కారణాల వల్లే రాష్ట్రంలో అదనపు బలగాలను మోహరించామని వివరించారు. 
 
ఊహాగానాలు, అసత్య వార్తలను ప్రజలు నమ్మొద్దని సూచించారు. ఉగ్ర ముప్పుపై నిఘా వర్గాల సమాచారంతోనే అదనపు బలగాలను మోహరించామన్నారు. రాజకీయ పార్టీలు ప్రజలను భయభ్రాంతులకు గురిచేయొద్దని సూచించారు. ఈ మేరకు గవర్నర్‌ కార్యాలయం శనివారం ఒక ప్రకటన విడుదల చేసింది.
 
ఇదిలావుండగా, ఆయన మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్రంలో పరిస్థితి సాధారణంగానే ఉంది. లాల్‌ చౌక్‌లో ఏదైనా అనుకోనిది జరిగితే అంతా తెలిసిపోతుంది. కొన్ని రాజకీయ పార్టీలు అనవసర గందరగోళం సృష్టిస్తున్నాయన్నారు. 
 
కేంద్రం ద్వారా నాకు తెలిసిన వివరాల ప్రకారమే నేను ప్రకటన చేశాను. అందరూ అనుకుంటున్నట్లుగా ఇక్కడేదో జరగబోతోందన్నది వాస్తవం కాదు. రేపు ఏం జరగబోతుందన్నది నాకు తెలియదు. అది నా చేతుల్లో లేదని తెలిపారు