కేరళలో నోరో వైరస్: చికిత్స చేయకపోతే.. ప్రాణాంతకం కావొచ్చు..
కేరళ, తిరువనంతపురంలో ఇద్దరు పిల్లలకు నోరో వైరస్ సోకింది. ఈ విషయాన్ని కేరళ వైద్యాధికారులు ధ్రువీకరించారు. ఈ వైరస్ బారిన పడిన పిల్లలకు సకాలంలో చికిత్స చేయకపోతే ప్రాణాంతకం కావచ్చని వైద్యులు హెచ్చరించారు.
కలుషిత నీరు, ఆహారం ద్వారా నోరో వైరస్ వ్యాప్తి చెందుతోందని వైద్యాధికారులు తెలిపారు. అంతకుముందు నిఫా వైరస్ కూడా కేరళను పట్టి పీడించింది.
కేరళలో స్క్రబ్ టైఫస్ అనే వ్యాధితో ఇంకొకరు మరణించారు. గురువారం తెల్లవారుజామున తిరువనంతపురం జిల్లాలోని వర్కాలలో అశ్వతి (15) అనే బాలిక స్క్రబ్ టైఫస్ కారణంగా చనిపోయింది. అశ్వతి పదో తరగతి పరీక్షలు రాసి.. ఫలితాల కోసం ఎదురుచూస్తుంది.
ఇంతలోనే స్క్రబ్ టైఫస్ వ్యాధి ఆమెను కబలించింది. దాంతో ఆరోగ్య శాఖ మంత్రి వీణా జార్జ్ ఆమె గ్రామాన్ని, ఆమె చేరిన ఆస్పత్రిని వెంటనే సందర్శించాలని ప్రత్యేక వైద్య బృందాన్ని ఆదేశించారు.