1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By వరుణ్

అంబడోల సమీపంలో పట్టాలు తప్పిన గూడ్సు రైలు.. పలు రైళ్లు రద్దు

goods train derail
ఒడిశా రాష్ట్రంలోని అంబడోల ప్రాంతంలో ఓ గూడ్సు రైలు పట్టాలు తప్పింది. రాయగఢ్ జిల్లాలోని అంబడోల వద్ద ఓ గూడ్సు రైలుకు చెందిన నాలుగు వ్యాగన్లు పట్టాలు తప్పాయి. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోయినప్పటికీ ఆస్తి నష్టం మాత్రం జరిగింది. నాలుగు బోగీలు దెబ్బతినగా ట్రాక్ బాగా ధ్వంసమైంది. అయితే, ఈ ప్రమాదం వల్ల ఇతర రైళ్ల రాకపోకలకు ఎలాంటి అంతరాయం కలగలేదు.
 
ప్రమాద వార్త తెలియగానే రైల్వే ఉన్నతాధికారులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఈ గూడ్సు రైలు అంబడోలా నుంచి ప్రత్యేక మార్గంలో లాంజీగర్ వేదాంత లిమిటెడ్ ప్లాంట్‌లోకి వెళుతుండగా ప్రమాదం జరిగింది. 
 
మరోవైవు, ఇటీవల ఘోర రైలు ప్రమాదం జరిగిన బహానగ బజార్ రైల్వే స్టేషన్ వద్ద ట్రాక్ పునరుద్ధరణ పనులు ఇంకా జరుగుతున్నాయి. దీంతో ఈ మార్గంలో నడిచే పలు రైళ్లను ఆది, సోమవారాలు రద్దు చేసినట్టు రైల్వే శాఖ ప్రకటించింది. వీటిలో సికింద్రాబాద్ స్టేషన్ నుంచి బయలుదేరే రైళ్లు కూడా ఉన్నాయి. 
 
ఆదివారం ఏకంగా ఏడు రైళ్లను రద్దు చేయగా, సోమవారం మూడు రైళ్లను రద్దు చేస్తున్నట్టు తెలిపింది. ఆదివారం షాలిమార్-సికింద్రాబాద్, సికింద్రాబాద్-షాలిమార్ (18045/18046) ఈస్ట్‌కోస్ట్ ఎక్స్‌ప్రెస్ రద్దు కాగా, రేపు సికింద్రాబాద్-అగర్తల (07030), గౌహతి-సికింద్రాబాద్ (02605) ప్రత్యేక రైళ్లను కూడా రద్దు చేశారు. అలాగే, సంత్రాగచ్చి-తిరుపతి, తిరుపతి-సంత్రాగచ్చి (22855/22856) రైళ్లతోపాటు మరికొన్ని రైళ్లు కూడా రద్దయ్యాయి.
 
విశాఖపట్టణం-సికింద్రాబాద్ మధ్య నడిచే వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్ల రాకపోకలు శనివారం గంటల కొద్దీ ఆలస్యంగా నడిచింది. ఉదయం 5.45 గంటలకు విశాఖలో బయలుదేరాల్సిన రైలు మధ్యాహ్నం 2.10 గంటలకు బయలుదేరడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.