1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : మంగళవారం, 28 ఫిబ్రవరి 2017 (11:07 IST)

రాష్ట్రపతి వద్దకు పన్నీర్ టీమ్.. పళని పదవికి ఎసరు.. అమ్మ మృతిపై కూడా?

అన్నాడీఎంకే అసమ్మతి ఎంపీలు మంగళవారం రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీతో సమావేశం కానున్నారు. దివంగత సీఎం జయలలితకు అపోలో యాజమాన్యం అందించిన వైద్యం, ఆమె మృతికి గల కారణాలపై సమగ్ర విచారణ జరపాలని కోరుతూ వినతిపత్రం

అన్నాడీఎంకే అసమ్మతి ఎంపీలు మంగళవారం రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీతో సమావేశం కానున్నారు. దివంగత సీఎం జయలలితకు అపోలో యాజమాన్యం అందించిన వైద్యం, ఆమె మృతికి గల కారణాలపై సమగ్ర విచారణ జరపాలని కోరుతూ వినతిపత్రం సమర్పించనున్నారు. రాజ్యసభ సభ్యుడు మైత్రేయన్ నేతృత్వంలో ఎంపీల బృందం రాష్ట్రపతిని కలవనుంది. ప్రత్యేకించి తమిళనాడు అసెంబ్లీలో ఈ నెల 18వ తేదీన పళని ప్రభుత్వం విశ్వాస పరీక్షను రద్దు చేయాలని కూడా ఈ బృందం రాష్ట్రపతిని కోరనుంది. ప్రస్తుతం పన్నీర్ పక్షాన 12 మంది ఎంపీల్లో 10 మంది లోక్ సభ్యులు కాగా మిగిలిన వారు ఇద్దరు రాజ్యసభలో కొనసాగుతున్నారు.
 
ఇదిలా ఉంటే.. తమిళనాడు మాజీ మంత్రి, పన్నీర్ వర్గానికి చెందిన అన్నాడీఎంకే నేత పొన్నయన్ సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. దివంగత ముఖ్యమంత్రి జయలలితను శశికళ కొట్టడం వల్లే ఆమె తీవ్ర అనారోగ్యానికి గురయ్యారని ఆరోపించారు. ఆస్పత్రిలో జయలలిత రెండు నెలలకుపైగా చికిత్స తీసుకున్నప్పటికీ ఆమెను చూసేందుకు మాత్రం ఎవరినీ అనుమతించలేదన్నారు. చివరికి అప్పటి ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వాన్ని కూడా ఆస్పత్రిలో అడుగుపెట్టనీయలేదని గుర్తు చేశారు. 
 
పేషెంట్‌కి ఇన్ఫెక్షన్ వస్తుందన్న పేరుతో కీలక నేతలెవరనీ ఆస్పత్రిలో అడుగుపట్టనీయలేదని పొన్నయన్ పేర్కొన్నారు. శశికళ మాత్రం జయ గదిలో ఎందుకున్నారని ప్రశ్నించారు. జయలలిత ఆస్పత్రిలో చేరడానికి ముందే ఇంట్లో ఆమెపై దాడి జరిగిందని ఆరోపించారు. ఈ కారణంగానే ఆమె ప్రాణాపాయస్థితిలో ఆస్పత్రిలో చేరారన్నారు. అపోలో వైద్యులు కూడా జయ విషయంలో రహస్యాలు పాటించడాన్ని చూస్తే శశికళకు, వారికి మధ్య రహస్య ఒప్పందం ఏదో జరిగిందని అనిపిస్తోందని ఆరోపించారు. జయలలిత మృతిపై న్యాయ విచారణ కోసం కమిషన్‌ను నియమించాలని పొన్నయన్ డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే.