సోమవారం, 27 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 19 ఫిబ్రవరి 2023 (10:04 IST)

పది పిల్లలకు తల్లి.. ఇకపై నా వల్ల కాదంటూ కు.ని ఆపరేషన్.. ఇంటి నుంచి గెంటేసిన భర్త!

orissa mother
ఇప్పటికే పది పిల్లలకు ఆమె జన్మనిచ్చింది. భర్తకు మాత్రం ఇంకా పిల్లలు కావాలంట. కానీ, పిల్లలను కనడం ఇక నా వల్ల కాదని తెగేసి చెప్పి కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకుంది. ఈ విషయం తెలుసుకున్న భర్త.. ఆమెను ఇంటి నుంచి గెంటేశాడు. పితృదేవతలకు పూజలు చేసేందుకు పనికిరావంటూ ఇంటి నుంచి బయటకు పంపించారు. దీంతో రోడ్డున పడిన ఆమెను ఆశా వర్కర్లు ఆదుకున్నారు. ఈ ఘటన ఒరిస్సా రాష్ట్రంలోని కియోంఝర్ జిల్లా టెల్కోయి సమితి డిమిరియా అనే గ్రామంలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
ఈ గ్రామానికి చెందిన రహి దహురి - జానకి దహురి అనే దంపతులు ఉన్నారు. వీరికి పది మంది పిల్లలు ఉన్నారు. జానకి ఇటీవల మరోమారు గర్భందాల్చింది. అయితే, ప్రసవ సమయంలో బిడ్డ చనిపోయింది. మరోవైపు, కుటుంబ ఆర్థిక పరిస్థితులు అంతంతమాత్రం కావడంతో పిల్లల పోషణ భారంగా మారింది. 
 
ఈ క్రమంలో పది మంది పిల్లలుండటం, తరచూ అనారోగ్యం పాలవుతుంటంతో ఆశా వర్కర్లు చొరవతో జానతి కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకుంది. ఈ విషయం భర్తకు తెలిసింది. అంతే.. భార్యపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ, ఇంట్లోకి రాకుండా అడ్డుకున్నారు. పితృదేవతలకు పూజలు చేసేందుకు పనికిరావంటూ ఆమెను ఇంటి నుంచి గెంటేశాడు. పైగా, ఇంట్లోకి అడుగుపెడితే చంపేస్తానంటూ మారణాయుధాలతో తిరుగుతున్నాడు. 
 
దీంతో రోడ్డున పడిన ఆ మహిళను ఆశా వర్కర్లు ఆదుకున్నారు. తల్లీపిల్లలకు వేళకు ఆహారం అందిస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న ఆరోగ్య అధికారులు రవికి నచ్చజెప్పే ప్రయత్నం చేసినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. దీంతో తల్లీ పిల్లలను ప్రభుత్వ సంరక్షమ కేంద్రానికి తరలించి, పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు రవిని అదుపులోకి తీసుకుని కౌన్సెలింగ్ ఇస్తున్నారు.