గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 7 సెప్టెంబరు 2023 (10:04 IST)

భారత్‌గా మారిన ఇండియా.. ఇండియాగా మారనున్న పాకిస్థాన్? సోషల్ మీడియాలో వైరల్

Bharat-Pakistan
ప్రధాని నరేంద్ర మోడీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం దేశం పేరును మార్చింది. ఇండియా స్థానంలో భారత్ అని పెట్టింది. మరో రెండు రోజుల్లో దేశ రాజధాని ఢిల్లీలో జీ20 శిఖరాగ్ర సదస్సు జరుగనుంది. ఇందుకోసం ముద్రించిన అన్ని ఆహ్వాన పత్రికల్లో ఇండియా స్థానంలో భారత్ అని కేంద్రం ముద్రించింది. చివరకు భారత రాష్ట్రపతి ఇచ్చే విందుకోసం ముద్రించిన ఆహ్వాన పత్రికల్లో కూడా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకు బదులు ప్రెసిడెంట్ ఆఫ్ భారత్ అని ముద్రించారు. 
 
ఈ పేరు మార్పునకు ఈ నెల 18వ తేదీ నుంచి జరిగే ప్రత్యేక పార్లమెంట్ సమావేశాల్లో ఆమోదముద్ర వేస్తారన్న ఊహాగానాలు వస్తున్నాయి. దేశం పేరును సవరించేందుకు వీలుగా రాజ్యాంగాన్ని సవరించే బిల్లును ఈ పార్లమెంట్ సమావేశాల్లో పెట్టే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తుంది. దీంతో దేశం పేరుపై పెద్ద ఎత్తున చర్చసాగుతోంది. 
 
మరోవైపు, దాయాది దేశమైన పాకిస్థాన్ మీడియా కూడా ఈ అంశంపై స్పందించింది. 'ఇండియా' అధికారికంగా ఐక్యరాజ్య సమితి (ఐరాస) స్థాయిలో తన పేరును 'భారత్'గా మార్చుకున్నట్లయితే, 'ఇండియా' పేరును పాకిస్థాన్ దక్కించుకునే అవకాశమున్నదని ఆ దేశానికి చెందిన స్థానిక మీడియా పేర్కొంది. పాకిస్థాన్‌లోని ఇండస్ ప్రాంతాన్ని సూచించే 'ఇండియా' పేరుపై హక్కు తమకే ఎక్కువగా ఉన్నదని పాకిస్థాన్ జాతీయులు ఎప్పటి నుంచో వాదిస్తున్న విషయాన్ని ఈ సందర్భంగా పాక్ పౌరులు గుర్తు చేస్తున్నారు. పాకిస్థాన్ స్థానిక మీడియా ట్విట్టర్ ఈ మేరకు చేసిన ఒక పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఈ అంశం చర్చనీయాశంగా మారింది.