జమ్మూకాశ్మీర్‌లో కూలిన సొరంగం.. శిథిలాల కింద అనేకమంది..?
జమ్మూకాశ్మీర్‌లో ఘోర ప్రమాదం జరిగింది. నిర్మాణంలో ఉన్న టన్నెల్ కూలింది. అనేక మంది శిథిలాల కింద చిక్కుకున్నారు. రాత్రి నిర్మాణ పనులను పరిశీలిస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది.
ఘటనాస్థలికి చేరుకున్న ఆర్మీ, పోలీసులు సహాయక చర్యల్లో నిమగ్నమయ్యారు. టన్నెల్ కూలిపోవడంతో జమ్మూ-శ్రీనగర్ జాతీయ రహదారిని తాత్కాలికంగా మూసివేశారు. దీంతో వాహనాల రాకపోకలకు తీవ్ర ఏర్పడింది.
సొరంగం కూలిపోవడంతో పలువురు గాయపడ్డారు. సహాయక చర్యలు కొనసాగుతున్నట్లు జమ్మూ కాశ్మీర్ విపత్తు నిర్వహణ అథారిటీ తెలిపింది. పోలీసులు,సైన్యం కూడా సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయి.
సొరంగం లోపల చిక్కుకున్న పదిమంది సొరంగం ఆడిట్ చేసే పనిని నిర్వహించే సంస్థకు చెందినవారని అధికారులు తెలిపారు.
ఈ ఘటనలో సొరంగం ముందు భాగంలో నిలిపి ఉంచిన బుల్డోజర్లు, ట్రక్కులతో సహా అనేక యంత్రాలు, వాహనాలు దెబ్బతిన్నాయి.
రాంబన్ డిప్యూటీ కమిషనర్ మసరతుల్ ఇస్లామ్, సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ మోహిత శర్మ సంఘటనా స్థలంలో సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు.