శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : మంగళవారం, 3 డిశెంబరు 2019 (06:26 IST)

మోదీతో భేటీపై పవార్ సంచలన విషయాలు

కొన్ని రోజుల క్రితం ప్రధాని మోదీ, ఎన్సీపీ శరద్ పవార్ భేటీ అయినపుడు వారిద్దరూ ఏం మాట్లాడుకున్నారు? ప్రధాని మోదీ శరద్ పవార్ ముందు పెట్టిన ప్రతిపాదనలకు శరద్ పవార్ ఏం బదులిచ్చారు... వీటన్నింటినీ శరద్ పవార్ బట్టబయలు చేశారు.

మనమిద్దరమూ కలిసి పనిచేద్దామని తనతో ప్రధాని మోదీ ప్రతిపాదించారని, అయితే తాను ఆ ప్రతిపాదనను తిరస్కరించానని పవార్ ప్రకటించారు. ఇద్దరం కలిసి పనిచేయడం జరిగే పనికాదని తాను స్పష్టం చేశానని ఆయన వెల్లడించారు.
 
‘‘కలిసి పనిచేయాలని మోదీ ప్రతిపాదించారు. మనిద్దరి మధ్య వ్యక్తిగత సంబంధాలు బాగానే ఉన్నాయి. కానీ, కలిసి పనిచేయడం సాధ్యమయ్యే పనికాదు.’’ అని మోదీకి తేల్చి చెప్పానని పవార్ తెలిపారు. అయితే రాబోయే రోజుల్లో రాష్ట్రపతి పదవి ఇస్తారని వచ్చిన వార్తలు పచ్చి అబద్ధమని, కానీ తన కుమార్తె సుప్రియా సూలేను కేంద్ర కేబినెట్‌లోకి తీసుకోవానలని మాత్రం ప్రతిపాదించానని శరద్ పవార్ వెల్లడించారు. 

 
మహారాష్ట్ర సంక్షోభం కొనసాగుతున్న సమయంలోనే సాక్షాత్తూ పార్లమెంట్ వేదికగా ప్రధాని మోదీ ఎన్సీపీ అధినేత శరద్ పవార్‌పై ప్రశంసల వర్షం కురిపించిన విషయం తెలిసిందే. బీజేపీతో సహా మిగిలిన పార్టీలు కూడా ఎన్సీపీ క్రమశిక్షణను చూసి నేర్చుకోవాలని అన్నారు. అంతేకాకుండా 2016 లో కూడా పవార్ పై మోదీ పూణే వేదికగా ప్రశంసల వర్షమే కురిపించారు.
 
2016 లో పూణేలో ని వసంత్ దాదా షుగర్ ఇనిస్టిట్యూట్‌ను సందర్శించిన సమయంలో మోదీ మాట్లాడుతూ... ప్రజా జీవితంలో ఉన్న నేతలకు పవార్ జీవితం ఆదర్శమని వ్యాఖ్యానించారు. ‘‘గుజరాత్ ముఖ్యమంత్రిగా నేను ఉన్న సమయంలో నా చేయి పట్టుకొని పవార్ నడిపించారు. వ్యక్తిగతంగా నేను పవార్ ను ఇష్టపడతాను. ఈ విషయం బహిరంగంగా చెప్పడానికి ఏమాత్రం జంకను’’అని మోదీ బహిరంగంగానే వ్యాఖ్యానించారు.