సోమవారం, 27 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 3 మే 2021 (12:12 IST)

ముఖ్యమంత్రి పదవులకు రాజీనామా చేసిన ఎడప్పాడి - విజయన్

ఆదివారం వెలువడిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో తమిళనాడు, కేరళ రాష్ట్రాలు కూడా ఉన్నాయి. ఈ ఎన్నికల ఫలితాల్లో తమిళనాడులో అధికార మార్పిడి జరుగగా, కేరళలో మాత్రం ఎల్డీఎఫ్ తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంది. 
 
ఈ క్రమలో ఎన్నిక‌ల్లో చ‌రిత్ర సృష్టించిన ముఖ్య‌మంత్రి పిన‌ర‌యి విజ‌య‌న్ సోమ‌వారం త‌న ప‌ద‌వికి రాజీనామా చేయ‌నున్నారు. సీపీఐ (ఎం) రాష్ట్ర సెక్ర‌టేరియ‌ట్ మంగ‌ళ‌వారం స‌మావేశంకానుంది. కొత్త మంత్రివ‌ర్గంతోపాటు విజ‌య‌న్ మ‌రోసారి సీఎంగా ప్ర‌మాణం చేస్తారు. ప్ర‌మాణ స్వీకారోత్స‌వం ఈ నెల 7 నుంచి 10వ తేదీ మ‌ధ్య ఉండే అవ‌కాశం ఉంది.
 
కేర‌ళ‌లో 140 స్థానాల‌కుగాను ఎల్డీఎఫ్ 99 స్థానాల్లో గెలిచి తిరుగులేని మెజార్టీ సాధించిన విష‌యం తెలిసిందే. 40 ఏళ్ల చ‌రిత్ర‌ను తిర‌గరాస్తూ కేర‌ళ‌లో వ‌రుస‌గా రెండోసారి అధికారంలోకి వ‌స్తున్నారు పిన‌ర‌యి విజ‌య‌న్‌. ఈ ఎన్నిక‌ల్లో ప్ర‌తిప‌క్ష యూడీఎఫ్ 41 స్థానాల‌కు ప‌రిమితం కాగా.. బీజేపీ ఖాతా కూడా తెర‌వ‌లేక‌పోయింది. గ‌తంలో ఉన్న ఒక్క స్థానంలోనూ కాషాయ పార్టీ ఓడిపోయింది.
 
మరోవైపు, తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎడప్పాడి కె.పళనిస్వామి కూడా తన పదవికి రాజీనామా చేయనున్నారు. ఈ ఎన్నికల్లో అన్నాడీఎంకే కూటమి చిత్తుగా ఓడిపోయిన విషయం తెల్సిందే. డీఎంకే కూటమి 157 స్థానాల్లో విజయభేరీ మోగించి, పదేళ్ళ తర్వాత అధికారంలోకి రానుంది. దీంతో సీఎం పదవికి ఎడప్పాడి రాజీనామా చేయనున్నారు. ఆయన తన రాజీనామా లేఖను రాష్ట్ర గవర్నరుకు పంపించనున్నారు.