శనివారం, 25 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 21 అక్టోబరు 2019 (16:13 IST)

కొందరి పిల్ల చేష్టల వల్ల పేదలు నష్టపోతున్నారు : పియూష్ గోయల్

కొంతమంది చేష్టల వల్ల పేదలకు అభివృద్ధికి దూరమవుతున్నారని కేంద్ర మంత్రి పియూష్ గోయల్ అభిప్రాయపడ్డారు. గోవాలో జరిగిన వైబ్రంట్‌ గోవా బిజినెస్‌ కాన్‌క్లేవ్‌ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అభివృద్ధి కార్యక్రమాలను అడ్డుకుంటున్న వారికి వ్యతిరేకంగా ప్రజా ఉద్యమం చేపట్టాలని ఆయన పిలుపునిచ్చారు. ఇలాంటి వారి వల్ల దేశంలో పేదవారికి న్యాయం జరగడం లేదని వాపోయారు. 
 
గోవాలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను అడ్డుకోవడానికి కొందరు (ఎన్జీవోలు) కోర్టులను ఆశ్రయించారు. ఫలితంగా అభివృద్ధి కుంటుపడింది. వీరి చర్యల వల్ల పేదవారికి న్యాయం జరుగడం లేదు. అందుకే ఇలాంటివారికి వ్యతిరేకంగా ప్రజా ఉద్యమం రావాలి అని వ్యాఖ్యానించారు. 
 
గోవాలో మంచి రోడ్లు నిర్మించడాన్ని, హోటళ్లు ఏర్పాటు చేయడాన్ని, విమానాశ్రయాలను నెలకొల్పడాన్ని, పోర్టులను విస్తరించడాన్ని కొందరు అడ్డుకుంటున్నారు. దీంతో ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన గోవాలో అభివృద్ధి ఎలా సాధ్యమవుతుంది? గోవా అభివృద్ధి చెందితే అక్కడ నివసించే ప్రజలు కూడా మెరుగైన జీవనాన్ని సాగిస్తారు. కానీ కొందరి చేష్టల వల్ల పేదవారు మెరుగైన జీవనాన్ని పొందలేకపోతున్నారు అని ఆయన వ్యాఖ్యానించారు.