శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : ఆదివారం, 25 సెప్టెంబరు 2016 (10:20 IST)

పాకిస్థాన్‌తో యుద్ధానికి మేం సిద్ధం.. దమ్ముంటే రండి : ప్రధానమంత్రి నరేంద్ర మోడీ

పాకిస్థాన్‌తో యుద్ధం చేసేందుకు సిద్ధంగా ఉన్నట్టు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రకటించారు. యుద్ధం అంటే ప్రత్యక్ష యుద్ధం కాదనీ, పేదరికం నిర్మూలన, నిరుద్యోగం, నిరక్షరాస్యత, శిశుమరణాలపై పోరు చేద్ధామని ఆయన ప

పాకిస్థాన్‌తో యుద్ధం చేసేందుకు సిద్ధంగా ఉన్నట్టు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రకటించారు. యుద్ధం అంటే ప్రత్యక్ష యుద్ధం కాదనీ, పేదరికం నిర్మూలన, నిరుద్యోగం, నిరక్షరాస్యత, శిశుమరణాలపై పోరు చేద్ధామని ఆయన పిలుపునిచ్చారు. ఈ యుద్ధంలో గెలుపెవరిదో తేల్చుకుందాం రా రండంటూ ఆయన పాకిస్థాన్‌కు సవాల్ విసిరారు.  
 
యురీలోని ఆర్మీ సెక్టార్‌పై పాకిస్థాన్ ప్రేరేపిత ముష్కర మూకలు దాడి చేసి 18 మంది భారత సైనికులను పొట్టనబెట్టుకున్న విషయం తెల్సిందే. దీనిపై కోళికోడ్ వేదికగా జరిగిన బీజేపీ జాతీయస్థాయి సమావేశంలో ప్రధాని మోడీ పాల్గొని యురీ దాడిపై తొలిసారి బహిరంగంగా స్పందించారు. ఈ సంద్భంగా ఆయన మాట్లాడుతూ... "మీ నాయకులు వెయ్యేళ్ల యుద్ధానికి సిద్ధమంటున్నారు. దమ్ముంటే రండి. మీకు యుద్ధమే కావాలనుకుంటే.. రండి చేద్దాం! భారతదేశం అందుకు సిద్ధంగా ఉంది. మీకు అంత శక్తి ఉంటే పేదరికానికి వ్యతిరేకంగా పోరాడండి. ఎవరు ముందుగా పేదరికాన్ని నిర్మూలిస్తారో.. నిరుద్యోగ సమస్యను పరిష్కరిస్తారో.. శిశుమరణాలను, పౌష్టికాహారలేమిని నిరోధిస్తారో.. నిరక్షరాస్యతను రూపుమాపుతారో.. ఎవరు గెలుస్తారో.. చూద్దాం" అంటూ పిలుపునిచ్చారు. 
 
అంతేకాకుండా, యురీ దాడిలో వీరమరణం పొందిన జవాన్ల త్యాగం వృథాగా పోదని స్పష్టం చేశారు. "మీరు పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌ను సరిగ్గా చక్కదిద్దుకోలేరు. ఒకప్పుడు మీ అధీనంలోనే ఉన్న బంగ్లాదేశ్‌నూ కాపాడుకోలేకపోయారు. గిల్గిట్‌, బాల్టిస్థాన్‌, పక్తూంఖ్వా, బలూచిస్థాన్‌, సింధ్‌.. దేన్నీ చక్కదిద్దుకోలేరు. అలాంటి మీరు కశ్మీర్‌ గురించి మాట్లాడతారా?" అంటూ పాకిస్థాన్‌ను సూటిగా ప్రశ్నించారు. 
 
ఇటీవల ఉగ్రవాదులు మన దేశంలోకి చొరబడేందుకు చేసిన 17 ప్రయత్నాలను మన జవాన్లు వమ్ము చేశారని, 110 మందికి పైగా ఉగ్రవాదులను మట్టుబెట్టారని చెప్పారు. "మన సైనికులు, భద్రతాదళాలు విజయాలు సాధిస్తున్నది కేవలం ఆయుధాలతో కాదు. అవి వట్టి బొమ్మలు మాత్రమే. మన జవాన్లు విజయాలు సాధిస్తోంది తమ ఆత్మవిశ్వాసంతో. భారతదేశ ఆత్మవిశ్వాసం ఎన్నడూ లేనంత ఉన్నతస్థాయిలో ఉంది. ఇదే మన బలం" అంటూ ఆయన వ్యాఖ్యానించారు. భారతదేశం సురక్షితమేనని.. 125 కోట్ల మంది భారతీయులకు మన సైనికులు, భద్రతాదళాల ధైర్యసాహసాలు గర్వకారణమని పేర్కొన్నారు.