శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 8 ఫిబ్రవరి 2021 (12:53 IST)

సాగు చట్టాలపై రాజకీయాల కోసం యూ టర్న్ తీసుకున్నారు: ప్రధాని మోడీ

గతంలో వ్యవసాయ రంగంలో సంస్కరణలకు అనుకూలంగా మాట్లాడారు. పైగా, సాగు చట్టాలకు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. కానీ, ఇపుడు రాజకీయాల కోసం యూటర్న్ తీసుకుని మాట్లాడుతున్నారంటూ ప్రధాని నరేంద్ర మోడీ విపక్ష సభ్యులకు చురకలు అంటించారు. 
 
అంతేకాకుండా, గతంలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ చేసిన వ్యాఖ్యలను ఈ సందర్భంగా మోడీ ఉటంకించారు. 'పెద్ద పెద్ద మార్కెట్ వ్యవస్థలను తీసుకురావడానికి చాలా ఇబ్బందులున్నాయి. వాటిని తొలగించి, రైతులకు లబ్ధి చేకూర్చడానికి ప్రయత్నిస్తున్నాం' అని  వ్యాఖ్యానించారని గుర్తుచేశారు. 
 
అంతేకాకుండా, గతంలో అందరు నేతలూ వ్యవసాయ సంస్కరణలకు అనుకూలంగా మాట్లాడిన వారేనని, ఇప్పుడు మాత్రం రాజకీయాల కోసం యూటర్న్ తీసుకున్నారని మోడీ తీవ్రంగా మండిపడ్డారు. వ్యవసాయ సంస్కరణలపై ఎన్సీపీ అధినేత శరద్ పవార్ కూడా మాట్లాడారని, ఇప్పటికీ ఆయన సంస్కరణలకు ఏమాత్రం వ్యతిరేకి కాదని చెప్పుకొచ్చారు. 
 
రైతులకు ఏది మేలు చేకూరుస్తుందో వాటినే తీసుకొస్తున్నామని, ఇకపై కూడా తీసుకొస్తామని మోడీ స్పష్టం చేశారు. గతంలో లాల్‌బహదూర్ శాస్త్రి కూడా సంస్కరణలకు అనుగుణంగా అడుగులు వేస్తుంటే అనేక ఇబ్బందులను ఎదుర్కొన్నారని, అయినా సరే ఏమాత్రం వెనకడుగు వేయలేదని మోడీ గుర్తు చేస్తూ, తాను కూడా వెనకడుగు వేయబోమని చెప్పకనే చెప్పారు. 
 
అప్పుడు వామపక్షాలు కాంగ్రెస్‌‌పై అమెరికా ఏజెంట్లంటూ విరుచుకుపడేవారని, ఇప్పుడు కూడా వారే నన్ను విమర్శిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏదైనా చట్టం వచ్చినప్పుడు, కొన్ని రోజుల తర్వాత అందులో మార్పులు చేర్పులు చోటుచేసుకుంటాయని వివరించారు. సాగు చట్టాల్లోని మంచి విషయాలను రైతులకు వివరించడానికే తాము శతధా ప్రయత్నిస్తున్నామని ఆయన పేర్కొన్నారు.
 
రైతులు పెద్ద ఎత్తున చాలా రోజుల పాటు ఆందోళనల్లో కూర్చుండిపోయారని, వారందరూ తమ తమ ఇళ్లకు చేరుకోవాలని విజ్ఞప్తి చేశారు. రైతులు ఉద్యమాన్ని ముగించి, ప్రభుత్వంతో చర్చకు రావాలని మోడీ ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. 
 
కనీస మద్దతు ధర ఉందని, ఇకపై కూడా ఉంటుందని, అందులో ఎలాంటి సందేహమూ లేదని ప్రధాని మోడీ పునరుద్ఘాటించారు. ఒకవేల ఈ సాగు చట్టాలను అమలు చేయలేక పోతే రైతులు అంధకారంలో మునిగిపోయే ప్రమాదం ఉందని ప్రధాని మోడీ వ్యాఖ్యానించారు.