శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ivr
Last Modified: గురువారం, 26 ఫిబ్రవరి 2015 (16:38 IST)

రాహుల్ గాంధీ కనబడుటలేదు... ఆచూకి చెప్పినవారికి రివార్డ్.... పోస్టర్స్

కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ జాడ వ్యవహారం ఆ పార్టీలోనే కాదు... దేశంలో కూడా పెద్ద చర్చనీయాంశంగా మారింది. అసలు రాహుల్ గాంధీ ఎందుకు అలా కనిపించకుండా పోయారన్న దానిపై ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో రకరకాల వాదనలు వినిపిస్తున్నాయనుకోండి. 
 
తాజాగా ఉత్తరాది రాష్ట్రాల్లో రాహుల్ గాంధీ కనబడుటలేదు అంటూ పోస్టర్స్ కూడా వెలుస్తున్నాయి. జాడ చెప్పిన వారికి రివార్డ్ అంటూ ఫన్నీగా పోస్టర్లు ప్రింటు చేసి వాటిని ప్రదర్శిస్తున్నారు కూడా. అలహాబాదులో ఓ పోస్టరులో జూనియర్ గాంధీ వివరాలు తెలిపినవారికి రివార్డు ఇస్తామంటూ ఓ పోస్టరు వెలిసింది. ఇలా పలు రాష్ట్రాల్లో భాజపా నాయకులు రాహుల్ గాంధీ అజ్ఞాతంలోకి వెళ్లడంపై సెటైర్లు విసురుతున్నారు.
 
ఇదిలావుంటే కాంగ్రెస్ పార్టీ ముసలం రగులుకుందనీ, సీనియర్లు వర్సెస్ జూనియర్లుగా పరిస్థితి మారిందనే వాదనలు బలంగా వినబడుతున్నాయి. రాహుల్ గాంధీ నిర్ణయాలను సీనియర్లు ఖాతరు చేయడం లేదనీ, అందువల్లనే ఇటీవలి ఎన్నికల్లో పార్టీ అధఃపాతాళానికి దిగజారిందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఐతే ఈ వాదనలన్నిటినీ కాంగ్రెస్ పార్టీ కొట్టి పారేస్తోంది. రాహుల్ గాంధీ అలాంటి కారణాలను చూపి దూరంగా పారిపోయే రకం కాదని వాదిస్తున్నారు. మొత్తమ్మీద రాహుల్ గాంధీ వ్యవహారం మలుపులు తిరుగుతోంది.