గురువారం, 28 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : శుక్రవారం, 8 జూన్ 2018 (08:56 IST)

మత దృష్టి, అసహనం, ద్వేషం.. దేశ అస్తిత్వానికే ముప్పు : ప్రణబ్ ముఖర్జీ

మత దృష్టి, అసహనం, ద్వేషం వంటి వాటితో దేశ అస్తిత్వానికే ముప్పు అని మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ వ్యాఖ్యానించారు. అదేసమయంలో సహనశీలతే భారతీయత అని ఆయన పునరుద్ఘాటించారు. బహుళత్వాన్ని అలవర్చుకునే గుణం మన

మత దృష్టి, అసహనం, ద్వేషం వంటి వాటితో దేశ అస్తిత్వానికే ముప్పు అని మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ వ్యాఖ్యానించారు. అదేసమయంలో సహనశీలతే భారతీయత అని ఆయన పునరుద్ఘాటించారు. బహుళత్వాన్ని అలవర్చుకునే గుణం మన జీవనవిధానంలోనే ఉందని, ఆ భిన్నత్వమే భారతీయతకు పునాది అని చెప్పారు.
 
నాగ్‌పూర్‌లో గురువారం జరిగిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆరెస్సెస్) మూడో వార్షిక శిక్షణ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈసందర్భంగా వందల మంది ఆరెస్సెస్ ప్రచారక్‌లను ఉద్దేశించి ప్రణబ్ ప్రసంగించారు. అసహనం, ద్వేషం, మతదృష్టితో దేశాన్ని నిర్వచించేందుకు ప్రయత్నించడం ప్రమాదకరమని, అది భారత్ అస్తిత్వాన్ని బలహీనపర్చడమే అవుతుందని హెచ్చరించారు. 
 
జాతి, జాతీయవాదం, దేశభక్తి గురించి నా అభిప్రాయాలను పంచుకునేందుకు మీ ముందుకు వచ్చాను. మనది వసుధైక కుటుంబకమ్ భావన. ఇది ఐరోపా జాతీయవాదానికి పూర్తి భిన్నమైనది. ఒకే భాష, ఒకే మతం, ఉమ్మడి శత్రువు అనే భావన ఆధారంగా అక్కడి జాతీయభావం ఉండగా, సార్వత్రికవాదంతో రూపొందిన రాజ్యాంగబద్ధమైన దేశభక్తికి మన జాతీయభావం ప్రతీకగా నిలుస్తుందన్నారు. 
 
అంతకుముందు నాగపూర్‌లోని ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యాలయానికి వచ్చిన వెంటనే ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ఆయనకు సాదర స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆర్ఎస్ఎస్ వ్యవస్థాపకుడు హెడ్గేవార్ జన్మస్థలాన్ని ఆయన సందర్శించారు. హెడ్గేవార్ నివసించిన ఇంటిని పరిశీలించారు. 'భరతమాత గొప్ప కుమారుడికి నివాళులర్పించేందుకు వచ్చాను' అంటూ సందర్శకుల పుస్తకంలో ప్రణబ్ రాశారు.