ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : గురువారం, 10 ఆగస్టు 2017 (11:20 IST)

స్కానింగ్ చేస్తే ఆడబిడ్డ అని తేలింది... అంతే భార్యకు యాసిడ్ తాగించి చంపేశాడు...

తనకు పుట్టబోయే బిడ్డ ఆడబిడ్డ అని తెలియగానే ఆ కసాయి భర్త.. కట్టుకున్న భార్యకు యాసిడ్ తాపించి చంపేశాడు. ఈ దారుణం వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలోని మిడ్నాపూర్‌లో జరిగింది. మానవత్వానికే మాయని మచ్చగా మిగిలిన దార

తనకు పుట్టబోయే బిడ్డ ఆడబిడ్డ అని తెలియగానే ఆ కసాయి భర్త.. కట్టుకున్న భార్యకు యాసిడ్ తాపించి చంపేశాడు. ఈ దారుణం వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలోని మిడ్నాపూర్‌లో జరిగింది. మానవత్వానికే మాయని మచ్చగా మిగిలిన దారుణ ఘటన వివరాలను పరిశీలిస్తే... 
 
మిడ్నాపూర్ జిల్లా కొత్భరా గ్రామానికి చెందిన రుబీనా బీబీ అనే మహిళ అదే గ్రామానికి చెందిన రేజాబుల్‌ అనే వ్యక్తిని పెళ్లాడింది. రుబీనా బీబీ 7 నెలల గర్భవతి. దీంతో ఆమెకు భర్త స్కానింగ్ చేయించాడు. ఈ స్కాన్ పరీక్షల్లో భార్య కడుపులో పెరుగుతున్నది ఆడబిడ్డ అని తేలింది. దీంతో పుట్టింటి నుంచి అదనంగా 1.3 లక్షల రూపాయల కట్నం తీసుకురమ్మని, కడుపులో ఆడబిడ్డ ఉన్నందున అబార్షన్ చేయించుకోవాలని ఒత్తిడి తెచ్చారు.
 
అదనపు కట్నం తీసుకురాకపోగా అబార్షన్ చేయించుకునేందుకు అంగీకరించక పోవడంతో భర్త, అత్తమామలు కలిసి రుబీనాకు బలవంతంగా యాసిడ్ తాగించారు. దీంతో చావుబతుకుల పరిస్థితిలో ఉన్న రుబీనా బీబీని ఆసుపత్రికి తరలించగా, ఆమె అప్పటికే మరణించిందని వైద్యులు నిర్ధారించారు. భర్త అత్తింటివారు పరారీలో ఉన్నారు. విషం వల్ల గర్భిణీ రుబీనాబీబీ మరణించిందని ప్రాథమికంగా తేలడంతో పోలీసులు భర్త, అత్తమామలపై కేసు నమోదు చేసి దర్యాప్తు ఆరంభించారు.