మంగళవారం, 30 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 5 ఆగస్టు 2020 (14:42 IST)

ఆధునిక భారతావనికి రామమందిరం ఓ చిహ్నం : రాష్ట్రపతి

కోట్లాది మంది చిరకాల స్వప్నమైన రామ మందిర నిర్మాణానికి అంకురార్పణ జరిగింది. అయోధ్య నగరిలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బుధవారం ఆలయ నిర్మాణం కోసం భూమి పూజ చేసి.. తొలి ఇటుకను అమర్చారు. ఈ ఆలయ నిర్మాణం మూడున్నరేళ్ళలో పూర్తికానుంది. దీనిపై రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ స్పందించారు. ఈ మేరకు ఆయన తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ చేశారు. 
 
'అయోధ్యలో నిర్మిస్తున్నరామమందిరం.. రామాయణంలోని సిద్ధాంతాలు, విలువలకు అద్దం పడుతుందని, ఆధునిక భారతదేశానికి చిహ్నంగా నిలుస్తుందన్నారు. చట్టబద్ధంగా నిర్మిస్తున్న రామాలయం భారతదేశం యొక్క సామాజిక సామరస్యం, ప్రజల ఆంకాక్షకు ప్రతిరూపమన్నారు'. ఈ భూమిపూజలో పాల్గొన్న వారందరికీ ఆయన అభినందనలు తెలిపారు.
 
అయోధ్యలోని వివాదస్పద రామజన్మభూమి రామ్‌లల్లాకే చెందుతుందని గత ఏడాది నవంబర్‌ 9న సుప్రీంకోర్టు చారిత్రక తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా దేశప్రజలు ఎంతో పరిణితి ప్రదర్శించారని, ప్రజాస్వామ్య సంస్థల విలువలను చాటారంటూ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ నాడు ప్రశంసించారు. 
 
ఈ సందర్భంగా ప్రధాని మోడీ 'శ్రీ రామ్ జన్మభూమి మందిరం'పై స్మారక పోస్టల్‌ స్టాంప్‌ను విడుదల చేశారు. భారత తపాలా శాఖ ఈ పోస్టల్‌ స్టాంప్‌ను రూపొందించింది. అంతకుముందు జరిగిన అయోధ్య భూమిపూజ కార్యక్రమంలో ప్రధాని మోడీ, ఉత్తరప్రదేశ్‌ గవర్నర్‌ ఆనందీబెన్‌ పటేల్‌, సీఎం యోగి ఆదిత్యనాథ్‌, ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్‌ మోహన్‌ భగవత్‌, రామ మందిరం ట్రస్ట్‌ అధ్యక్షుడు మహత్‌ నిత్య గోపాల్‌ దాస్‌తోపాటు 175 మంది ప్రముఖ ఆహ్వానితులు పాల్గొన్నారు.