ఒకే కుటుంబంలో 11 మంది ఆత్మహత్య.. ఎక్కడ?
రాజస్థాన్ రాష్ట్రంలో ఓ విషాదకర సంఘటన జరిగింది. పాకిస్థాన్ నుంచి వలస వచ్చిన హిందూ శరణార్థుల్లో ఒకే కుటుంబానికి చెందిన 12 మంది ఆత్మహత్యకు పాల్పడ్డారు. వీరిలో 11 మంది చనిపోగా, మరో వ్యక్తి ప్రాణాపాయ స్థితిలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, పాకిస్థాన్‌లోని సింధు ప్రావీన్స్‌కు చెందిన ఓ కుటుంబం కొన్నేళ్ల క్రితం రాజస్థాన్‌కు వచ్చింది. వీరంతా హిందూ శరణార్థులు. కుటుంబంలోని 12 మంది ఒకేసారి విషం తీసుకున్నారు. వీరంతా శనివారం రాత్రి ఒకేసారి ఆత్మహత్యకు పాల్పడ్డారు.
వీరిలో 11 మంది చనిపోగా, ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. కుటుంబ సభ్యులు ఆత్మహత్య చేసుకున్న ప్రాంతంలో పురుగుల మందు వాసన రావడంతో స్థానికులు పసిగట్టి పోలీసులకు సమాచారం అందించారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు... అక్కడకు వెళ్లి చూడగా, 11 మంది చనిపోయివుండగా, ప్రాణాపాయ స్థితిలో ఉన్న మరో వ్యక్తిని ఆస్పత్రికి తరలించారు. ఈ విషాద ఘటన రాజస్థాన్‌లోని దేచు పోలీసు స్టేషన్ పరిధిలో జరిగింది. అయితే, ఒకే సారి 12 మంది ఆత్మహత్యకు పాల్పడటం వెనుక ఉన్న కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.
ఇడుక్కి జిల్లాలో 27కు పెరిగిన మృతులు
గత 15 రోజులుగా కురుస్తున్నభారీ వర్షాలు కేరళ రాష్ట్రాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. వరదలు సంభవించి కొండచరియలు విరిగిపడి ప్రాణ, ఆస్తి నష్టం జరుగుతోంది. ఇడుక్కి జిల్లా రాజమల ప్రాంతంలో తేయాకు కార్మికుల నివాసాల నడుమ కొండచరియలు విరిగిపడిన ఘటనలో మృతుల సంఖ్య 27కు చేరింది. కొండ చరియలు విరిగిపడటంతో ఆ మట్టిదిబ్బల కింద చిక్కుకుపోయిన ఓ మృతదేహాన్ని ఆదివారం ఉదయం వెలికితీశారు. మృతుడిని అరుణ్ మహేశ్వర్ (34)గా గుర్తించారు. గత రెండురోజులు వెలికితీసిన మృతదేహాలకు అంత్యక్రియలు నిర్వహించారు.
కొండచరియలు విరిగిపడడంతో మట్టిదిబ్బల కింద చిక్కుకుపోయిన వారిని రక్షించేందుకు సహాయ చర్యలు కొనసాగుతున్నాయి. మృతుల కుటుంబాలకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయ్ విజయన్ శుక్రవారం రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సంతాపం తెలిపి ప్రధానమంత్రి జాతీయ ఉపశమన నిధి (పీఎంఎన్‌ఆర్‌ఎఫ్) నుంచి ఒక్కొక్కరికి రూ.2 లక్షలు పరిహారం ప్రకటించారు.