మంగళవారం, 26 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 13 ఆగస్టు 2020 (14:44 IST)

సెల్ఫ్ ఐసోలేషన్‌లోకి వెళ్లనున్న ప్రధాని మోడీ? ఎందుకో తెలుసా?

ఇటీవల ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అయోధ్య రామ మందిర నిర్మాణానికి భూమిపూజ చేశారు. అయోధ్యానగరంలో ఆగస్టు 5వ తేదీ జరిగిన ఈ భూమిపూజకు... అతికొద్దిమంది అతిథులను మాత్రమే ఆహ్వానించారు. అలాంటి వారిలో రామజన్మభూమి ట్రస్ట్‌ సారథి నృత్యగోపాల్ దాస్‌ ఒకరు. ఇపుడు ఈయనకు కరోనా వైరస్ సోకింది. ఈయనకు నిర్వహించి వైద్య పరీక్షల్లో కరోనా పాజిటివ్ అని వచ్చింది. దీంతో ఈయన ఆస్పత్రిలో చేరారు. 
 
అయితే, అయోధ్య రామ మందిర పూజా కార్యక్రమాలను ఈయనే స్వయంగా దగ్గరుండి నిర్వహించారు. ప్రధాని మోడీతో కలిసి ఆయన వేదికను పంచుకున్నారు. కృష్ణ జన్మాష్టమి వేడుకల సందర్భంగా నృత్యగోపాల్‌ దాస్ ప్రస్తుతంలో‌ మథురలో ఉంటున్నారు.
 
ఆరోగ్య సమస్యలు రావడంతో ఆయనకు వైద్యులు కరోనాతో పాటు పలు పరీక్షలు చేశారు. దీంతో ఆయనకు కొవిడ్-19 సోకినట్లు‌ నిర్ధారణ అయింది. నృత్య‌గోపాల్ దాస్‌కు కరోనా సోకిన విషయాన్ని తెలుసుకున్న యూపీ సీఎం యోగి ఆదిత్య‌నాథ్‌ ఇప్పటికే మ‌థుర డీఎంతో మాట్లాడిన‌ట్లు ఆ రాష్ట్ర సీఎంవో కార్యాల‌యం ఓ ప్ర‌క‌ట‌న‌లో తెలిపింది.
 
రామాలయ భూమిపూజ కార్యక్రమంలో ఆయనతో పాటు యూపీ గవర్నర్‌ ఆనందిబెన్‌తో పాటు ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్‌, ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్‌ మోహన్‌ భగవత్‌ సహా పలువురు వేదికపై కనపడ్డారు. కాగా, భూమిపూజకు ముందు కూడా ఆలయ పూజారి ప్రదీప్‌దాస్‌తో పాటు మరికొందరు పోలీసు సిబ్బందికి కరోనా సోకిన సంగతి విదితమే. 
 
అయితే, నృత్యగోపాల్ దాస్‌కు కరోనా వైరస్ సోకడంతో ఈయనతో కలిసి రామ మందిర నిర్మాణ భూమి పూజ కార్యక్రమంలో పాల్గొన్న వారందరూ కరోనా పరీక్షలు చేయించుకుంటారా? లేదా? అనేది తేలాల్సివుంది. ప్రధాని మోడీ సైతం హోం క్వారంటైన్‌కు వెళతరా? లేదా? తెలియాల్సివుంది.