1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : మంగళవారం, 24 జనవరి 2017 (08:52 IST)

హిరాఖండ్ ఎక్స్‌ప్రెస్ రైలు ప్రమాదానికి ఉగ్రకుట్ర కాదట.. మరేంటి?

విజయనగరం జిల్లాలో జరిగిన హిరాఖండ్ ఎక్స్‌ప్రెస్ రైలు ప్రమాదం వెనుక ఉగ్రకుట్ర లేదని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్.ఐ.ఏ) అధికారులు స్పష్టం చేశారు. అయితే, రైలు డ్రైవర్ (లోకో పైలట్) నిర్లక్ష్యంగా వ్యవహరించి సడ

విజయనగరం జిల్లాలో జరిగిన హిరాఖండ్ ఎక్స్‌ప్రెస్ రైలు ప్రమాదం వెనుక ఉగ్రకుట్ర లేదని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్.ఐ.ఏ) అధికారులు స్పష్టం చేశారు. అయితే, రైలు డ్రైవర్ (లోకో పైలట్) నిర్లక్ష్యంగా వ్యవహరించి సడన్ బ్రేక్ వేయడం వల్లే 40 మంది ప్రయాణికులు మృత్యువాత పడినట్టు రైల్వే వర్గాలు పేర్కొంటున్నాయి. 
 
ప్రధాన మార్గంలో రైలు వెళ్తున్నప్పుడు సడన్ బ్రేక్‌ వేయడమే డ్రైవర్‌ చేసిన పెద్ద తప్పని 'ట్రైన్స్ పాసింగ్‌ ఆపరేషన్' విభాగంలో ముఖ్య రవాణా అధికారిగా పనిచేసి రిటైరైన ఓ అధికారి అభిప్రాయపడ్డారు. మెయిన్ లైన్‌లో రైళ్లు గంటకు సగటున 70-80 కిలోమీటర్ల వేగంతో వెళుతుంటాయని, అటువంటి సమయంలో సడన్ బ్రేక్‌ వేస్తే ఇలాంటి ప్రమాదాలే జరుగుతాయన్నారు.
 
జగదల్‌పూర్‌ నుంచి శనివారం బయల్దేరిన హిరాఖండ్‌ ఎక్స్‌ప్రెస్‌ రాయగడ నుంచి ప్రధాన లైన్లోనే భువనేశ్వర్‌ వైపు వెళ్తోంది. కూనేరు రైల్వేస్టేషన క్రాసింగ్‌ పాయింట్‌ వద్ద పట్టా అడుగు మేర విరిగిపోయి ఉంది. దాని పైనుంచి హిరాఖండ్‌ రైలులో సగం బోగీలు సురక్షితంగా వెళ్లిపోయాయి. కొంతదూరం వెళ్లాక పెద్ద స్పార్క్‌, శబ్దం రావడంతో డ్రైవర్‌ సడన్ బ్రేక్‌ వేశాడు. దాంతో వెనక బోగీలు పట్టాలు తప్పి, ఒక దానిపైకొకటి ఎక్కి.. పక్కనే ఆగి ఉన్న గూడ్స్‌ రైలును ఢీకొట్టాయి. ‘డ్రైవర్‌ సడన్ బ్రేక్‌ వేయకుండా ఉంటే మిగిలిన బోగీలు కూడా ముందు బోగీల మాదిరిగానే సురక్షితంగా వెళ్లి ఉండేవి. 
 
ఒకవేళ కొన్ని బోగీలు పట్టాలు తప్పినా... అవి భూమిపైకి వచ్చి కొంతదూరం వెళ్లాక వేగం తగ్గి వాటంతట అవే ఆగిపోయేవి. బోగీలు ఒకదాన్ని మరొకటి ఢీకొట్టడం గానీ, ఒక దానిపై మరొకటి ఎక్కే అవకాశం గానీ ఉండేది కాదు. అలాగే పూర్తిగా భూమిపైకి ఒరిగిపోయేవి కావు. ఏదో జరిగిపోతుందని భయపడిన డ్రైవర్‌ తొందరపాటు నిర్ణయంతో సడన బ్రేక్‌ వేశాడు. ఇంత పెద్ద ప్రమాదం జరిగింది’ అని సీనియర్‌ అధికారులు విశ్లేషిస్తున్నారు.