ఆదివారం, 28 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 12 డిశెంబరు 2019 (14:08 IST)

'దిశ' ఎన్‌కౌంటర్‌ నిజాలు ప్రజలకు తెలియాలంటున్న సుప్రీం... సజ్జనార్‌కు చిక్కులేనా?

దేశంలో సంచలనం సృష్టించిన పశువైద్యురాలు దిశ కేసులోని నిందితులను ఎన్‌కౌంటర్ చేయడం వెనుక ఉన్న నిజాలు ప్రజలకు తెలియాల్సివుందని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఇందుకోసం ఓ త్రిసభ్య కమిషన్‌ను అపెక్స్ కోర్టు ఏర్పాటు చేసింది. ఇందులో సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి వీఎస్ సిర్పూర్‌కర్ సారథ్యంలో ముగ్గురు సభ్యులతో కమిషన్‌ను ఏర్పాటు చేసింది. ఇందులో సీబీఐ మాజీ డైరెక్టర్ కార్తికేయన్, వీఎన్ రేఖలు సభ్యులుగా ఉంటారు. 
 
ఈ కమిషన్ విచారణ కాలపరిమితి ఆరు నెలలుగా నిర్ణయించింది. ఈ ఆరు నెలల కాలంలో దిశ కేసుకు సంబంధంచి వివిధ కోర్టుల్లో సాగుతున్న విచారణపై స్టే విధించింది. ఈ కమిషన్ కేవలం ఎన్‌కౌంటర్‌పైనే విచారణ చేపట్టనుంది. ఈ కమిషన్‌ కోసం అయ్యే ఖర్చులన్నీ రాష్ట్ర ప్రభుత్వమే భరించనుంది.   
 
అంతకుముందు.. తెలంగాణ ప్రభుత్వం తరపున మాజీ అడ్వకేట్ జనరల్ ముకుల్ రోహత్గి వాదనలు వినిపించారు. కమిషన్ ఏర్పాటును ఆయన తీవ్రంగా వ్యతిరేకించారు. ఎన్‌కౌంటర్ వెనుక ఎలాంటి దురుద్దేశం లేదని కోర్టుకు తెలిపారు. సుప్రీం కోర్టు గైడ్‌లైన్స్‌ను పాటించారని నివేదించారు. 
 
అయితే సీజేఐ బాబ్డే.. ఈ వాదనలను అంగీకరించలేదు. నిజానిజాలు ప్రజలకు తెలియాల్సి ఉందని.. ఎన్‌కౌంటర్ జరిగిన తీరుపై అనుమానాలు తొలగించాల్సిన అవసరం ఉందని సీజేఐ వ్యాఖ్యానించి, విచారణ కోసం త్రిసభ్య కమిషన్‌ను ఏర్పాటు చేశారు. 
 
సుప్రీంకోర్టు తాజా ఆదేశాలతో ఈ ఎన్‌కౌంటర్‌లో కీలక పాత్ర వహించిన రాచకొండ సీపీ వీసీ సజ్జనార్‌కు చిక్కులు వచ్చేలా ఉన్నాయని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఈ కమిషన్ ఇచ్చే నివేదిక సజ్జనార్ పరిస్థితి ఏంటన్నది తెలుస్తుందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.