శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 30 సెప్టెంబరు 2020 (17:20 IST)

అందరూ నిర్దోషులైతే మసీదు దానంతట అదే కూలిపోయిందా? అసదుద్దీన్

బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో వెలువడిన తుదితీర్పుపై హైదరాబాద్ ఎంపీ, ఎంఐఎం అధినేత అసదుద్దీన్ తన స్పందన చేశారు. బాబ్రీ మసీదు దానంతట అదే కూలిపోయిందా అంటూ ప్రశ్నించారు. ఈ తీర్పు వెలువడిన రోజును ఆయన చీకటి రోజుగా అభివర్ణించారు.
 
బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో నిందితులుగా ఉన్న ఎల్కే.అద్వానీ, మురళీ మనోహర్ జోషి, ఉమాభారతితో సహా 32 మందిని లక్నోలోని సీబీఐ ప్రత్యేక కోర్టు బుధవారం నిర్దోషులుగా ప్రకటించింది. అభియోగాలను రుజువు చేసేందుకు సరైన సాక్ష్యాధారాలను సీబీఐ చూపలేకపోయిందని కోర్టు ఈ సందర్భంగా వ్యాఖ్యానించింది. 
 
ఈ తీర్పుపై ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ మాట్లాడుతూ, భారతీయ న్యాయవ్యవస్థకు ఈరోజు ఒక చీకటి రోజు అని అన్నారు. అయోధ్యలో వివాదాస్పద భూమికి సంబంధించి సుప్రీంకోర్టు వ్యాఖ్యానిస్తూ... చట్టాలను ఉల్లంఘించారని, పద్ధతి ప్రకారం ప్రార్థనా స్థలాన్ని నాశనం చేశారని వ్యాఖ్యానించిందని చెప్పారు.  
 
సీబీఐ కోర్టు తీర్పు బాధాకరమన్నారు. మసీదు కూల్చివేత వెనుక ఎలాంటి కుట్ర లేదని కోర్టు తెలిపడంపట్ల ఆయన అసహనం వ్యక్తం చేశారు. అందరూ నిర్దోషులైతే.. మరి మసీదును కూల్చింది ఎవరని ప్రశ్నించారు. బాబ్రీ మసీదు దానంతట అదే కూలిపోయిందా? అని అడిగారు. 
 
మసీదును ఎవరు కూల్చారో ప్రపంచమంతా చూసిందని అన్నారు. 'మసీదును కూల్చండి' అని ఉమా భారతి నినాదాలు చేశారని చెప్పారు. ఈ తీర్పును వెలువరించడం కోసం ఎంత కాలం కసరత్తు చేశారని అన్నారు. ఈ తీర్పుపై సీబీఐ హైకోర్టుకు వెళ్లాలని చెప్పారు.