బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : సోమవారం, 7 ఆగస్టు 2017 (16:38 IST)

పదో తరగతి ఫెయిలైన ఆటో డ్రైవర్‌తో కూతురి ప్రేమ-వద్దన్న తండ్రి: కేసు పెట్టడంతో ఆ నలుగురు ఆత్మహత్య

చిన్ననాటి నుంచి పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రుల కంటే.. ప్రేమే ముఖ్యమని ఆ యువతి గడప దాటింది. ప్రియుడిని వివాహం చేసుకుంది. అంతటితో ఆగకుండా పోలీసులకు ఫిర్యాదు చేసింది. అంతే ఆ అవమానంతో ఆ యువతి తల్లిదండ్రుల

చిన్ననాటి నుంచి పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రుల కంటే.. ప్రేమే ముఖ్యమని ఆ యువతి గడప దాటింది. ప్రియుడిని వివాహం చేసుకుంది. అంతటితో ఆగకుండా పోలీసులకు ఫిర్యాదు చేసింది. అంతే ఆ అవమానంతో ఆ యువతి తల్లిదండ్రులతో పాటు నలుగురు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ ఘటన తమిళనాడు సేలంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. సేలం జిల్లా తాండానూరులో రాజేంద్రన్ (45), రాణి (40) దంపతులకు ఉషా ( 23), ఆర్తీ (20), నవీన్ (17) అనే ముగ్గురు పిల్లలు ఉన్నారు. పెద్ద కుమార్తె ఉషా బీఏ పూర్తి చేసింది. ఉషా ఆటో డ్రైవర్ మణింకంఠన్‌‍ను ప్రేమించింది. 
 
మణికంఠన్ పదో తరగతి చదువుకోవడంతో అతనిని ఉషా వివాహం చేసుకునేందుకు ఆమె తండ్రి రాజేంద్రన్ నిరాకరించాడు. అయినా పెద్దలను ఎదిరించి ఉషా, మణికంఠన్‌ను వివాహం చేసుకుంది. మూడో తేదీ వీరి వివాహం రిజిస్టర్ ఆఫీసులో జరిగిపోయింది. తన కుమార్తె ఉషా కనిపించలేదని రాజేంద్రన్ ఫిర్యాదు చెయ్యడంతో తాండానూరు పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేశారు. అయితే ఉషా మాత్రం మణికంఠన్ పెళ్ళి చేసుకున్నానని, తల్లిదండ్రుల నుంచి రక్షణ కల్పించాలని వారు దాడి చేసే అవకాశం ఉందని కేసు పెట్టింది. 
 
కన్న కుమార్తె తమ మీద పోలీసులకు ఫిర్యాదు చెయ్యడంతో రాజేంద్రన్, రాణి దంపతులు జీర్ణించుకోలేకపోయారు. అవమానంతో రాజేంద్రన్, రాణి దంపతులు, వారి పిల్లలు ఆర్తీ, నవీన్ పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ విషయం తెలుసుకుని ఉషా చివరి చూపు కోసం వెళ్ళింది. కానీ అయితే రాజేంద్రన్ బంధువులు ఉషా మీద దాడి చేసే అవకాశం ఉందని గుర్తించిన పోలీసులు ఆమెను అంత్యక్రియలకు అనుమతించలేదు.