శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : బుధవారం, 15 ఫిబ్రవరి 2017 (13:34 IST)

శశికళ మళ్లీ కోర్టుకెందుకుగానీ నేరుగా జైలుకే తరలించండి.. కర్ణాటక హైకోర్టు రిజిస్ట్రార్ ఆదేశాలు

జయలలిత అక్రమాస్తుల కేసులో నాలుగేళ్ళ జైలుశిక్ష పడిన శశికళను నేరుగా బెంగుళూరులోని పరప్పణ అగ్రహారంలోని సెంట్రల్ జైలుకే తరలించాలని కర్నాటక హైకోర్టు రిజిస్ట్రార్ ఆదేశాలు జారీచేశారు. ఈ కేసులో శశికళ రెండో ము

జయలలిత అక్రమాస్తుల కేసులో నాలుగేళ్ళ జైలుశిక్ష పడిన శశికళను నేరుగా బెంగుళూరులోని పరప్పణ అగ్రహారంలోని సెంట్రల్ జైలుకే తరలించాలని కర్నాటక హైకోర్టు రిజిస్ట్రార్ ఆదేశాలు జారీచేశారు. ఈ కేసులో శశికళ రెండో ముద్దాయిగా కాగా, మూడో ముద్దాయిగా ఇళవరసి, నాలుగో ముద్దాయిగా జయలలిత దత్తపుత్రుడు సుధాకరన్ ఉన్నారు. 
 
వీరికి నాలుగేళ్ళ జైలుశిక్షతో పాటు.. రూ.10 కోట్ల అపరాధం కూడా విధించింది. అయితే, అనారోగ్యం కారణంగా కోర్టులో లొంగిపోయేందుకు నాలుగు వారాల సమయం ఇవ్వాలని శశికళ తరపు న్యాయవాదులు చేసిన వినతిని సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. తామిచ్చిన తీర్పులో ఎలాంటి మార్పులు చేయబోమని, తక్షణం లొంగిపోవాల్సిందేనంటూ స్పష్టం చేసింది. 
 
దీంతో కోర్టులో లొంగిపోయేందుకు శశికళ బెంగళూరు బయల్దేరింది. ఈ వ్యవహారంపై కర్ణాటక హైకోర్టు స్పందించింది. శశికళ కోర్టుకు హాజరవ్వాల్సిన అవసరం లేదని, సెంట్రల్ జైలుకే కోర్టును తరలించినట్లు కర్ణాటక హైకోర్టు రిజిస్ట్రార్ తెలిపారు. ఆమె జైలులోని ప్రత్యేక కోర్టు ఎదుట లొంగిపోవచ్చని చెప్పారు. ఆమెను సరాసరి బెంగళూరులోని సెంట్రల్ జైలుకు తరలించాలని కర్ణాటక హైకోర్టు ఆదేశించింది.
 
దీంతో శశికళ బెంగళూరులో అడుగు పెట్టిన గంటల వ్యవధిలోనే ఆమెను ఈ రాత్రికి జైలుకు తరలించనున్నారు. అయితే శశికళ అన్నాడీఎంకేను తన కుటుంబం ఆధీనంలోనే ఉండేలా పక్కా ప్లాన్ వేసింది. తన సోదరి కొడుకు దినకరన్‌ కోసం పార్టీలో కొత్త పోస్ట్ సృష్టించింది. పార్టీ డిప్యూటీ జనరల్ సెక్రటరీగా టీటీవీ దినకరన్‌ను నియమించి వెళ్లింది. అయితే ఈ నియామకం చెల్లే అవకాశాలు కనిపించడం లేదు. 
 
శశికళ జైలులోకి వెళ్లగానే ఎమ్మెల్యేలు పన్నీర్ వర్గం వైపు చేరేందుకు సిద్ధంగా ఉన్నారు. మెజార్టీ పార్టీ ఎమ్మెల్యేలు దినకరన్‌ నియామకాన్ని వ్యతిరేకించే అవకాశముంది. ఇదిలావుంటే పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నాడంటూ గతంలో దినకరన్‌ను సస్పెండ్ చేసింది. అలాగే, పోయెస్ గార్డెన్ చాయలకు కూడా రానివ్వలేదు. ఇప్పుడు అలాంటి వ్యక్తిని పార్టీలో ప్రాథమిక సభ్యత్వం కల్పించి.. ఉన్నఫళంగా పార్టీ డిప్యూటీ జనరల్ సెక్రటరీగా శశికళ నియమించడంతో అనేక మంది ఎమ్మెల్యేలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో పార్టీ నిలువునా చీలిపోయే అవకాశం ఉంది.