సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 21 జనవరి 2021 (11:39 IST)

జయలలిత నెచ్చెలి శశికళకు అస్వస్థత.. ఆస్పత్రికి తరలింపు

అక్రమాస్తుల కేసులో అరెస్ట్ అయిన తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత నెచ్చెలి శశికళ త్వరలోనే జైలు నుంచి విడుదల కానున్నారు. ఆమె విడుదల కావడానికి ముందే తమిళనాడులో రాజకీయ వేడి రగులుకుంది. ఆమె వచ్చినా రాష్ట్ర రాజకీయాల్లో ఎటువంటి మార్పులు జరగబోవని అన్నాడీఎంకే నేతలు ఇప్పటికే ప్రకటించారు. శశికళ త్వరలో జైలు నుంచి విడుదల అవుతారనుకున్న వేళ.. ఆమె అస్వస్థతకు లోనయ్యారు. 
 
దీంతో ఆమెను ఆస్పత్రికి తరలించారు. బుధవారం సాయంత్రం శశికళను పరప్పణ అగ్రహార జైలునుంచి భారీ బందోబస్తు మధ్య వైద్యుల పర్యవేక్షణలో శివాజీనగర్‌లోని బౌరింగ్‌ అస్పత్రికి తరలించారు. మంగళవారం మధ్యాహ్నం నుంచే శశికళకు జ్వరం రాగా రాత్రి అయ్యేసరికి శ్వాసకోశ సమస్య ఏర్పడింది. జైలు వైద్యాధికారి ఉమా నేతృత్వంలో శశికళకు బ్యారెక్‌లోనే చికిత్సలు చేశారు. బుధవారం ఉదయం వైద్యులు జైలులోనే వైద్యం కొనసాగించారు.
 
శ్వాసకోశంలో మార్పు లేకపోవడంతో ఉన్నతాధికారులతో చర్చించి మెరుగైన వైద్యం కోసం బౌరింగ్‌ ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రి వద్ద బందోబస్తు మధ్య ప్రత్యేక వార్డుకు పంపారు. శ్వాసకోశ సమస్య తీవ్రంగా వుండడంతోనే ఆస్పత్రికి తీసుకొచ్చినట్టు జైలుశాఖ వైద్యాధికారి తెలిపారు.