కరోనా వైరస్ సోకిన అహ్మద్ పటేల్ ఆరోగ్యం విషమం
కాంగ్రెస్ సీనియర్ నేత, ఆ పార్టీ కోశాధికారి అహ్మద్ పటేల్ ఆరోగ్య పరిస్థితి విషమంగా మారింది. 71 యేళ్ళ పటేల్‌కు కరోనా వైరస్ సోకింది. దీంతో గత అక్టోబరు ఒకటో తేదీ నుంచి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ వస్తున్నారు. అదేసమయంలో ఆయనకు ఇతర అనారోగ్య సమస్యలు కూడా తలెత్తుతూ వస్తున్నాయి. దీంతో ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా మారింది.
ప్రస్తుతం ఆయన గురుగావ్‌లోని మేదాంత ఆసుపత్రిలోని ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌లో చికిత్స పొందుతున్నారు. ఇన్‌ఫెక్షన్ కారణంగా ఆయన ఊపిరితిత్తులు దెబ్బతిన్నాయని, ఇతర కీలక అవయవాలపై కూడా ఆ ప్రభావం పడిందని అంటున్నారు. అహ్మద్ పటేల్ కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేతగానే కాకుండా, సోనియాగాంధీకి వ్యక్తిగత సలహాదారుగా, అత్యంత నమ్మకస్థుడైన నేతగా పేరుంది.
'నాన్నగారి పరిస్థితి నిలకడగా ఉంది. వైద్యుల పర్యవేక్షణలో చికిత్స జరుగుతోంది. ఆయన త్వరగా కోలుకునేలా అంతా ప్రార్ధించాలని కోరుతున్నాను' అని అహ్మద్ పటేల్ కుమారుడు ఫైసల్ పటేల్ ఓ ట్వీట్‌లో పేర్కొన్నారు.
అలాగే, అహ్మద్ పటేల్ ఆరోగ్యంపై పార్టీ సీనియర్ నేత ఆనంద్ శర్మ ఓ ట్వీట్ చేస్తూ, ఈ వార్త ఆందోళన కలిగిస్తోందని, తన మిత్రుడు, కామ్రేడ్ అహ్మద్ పటేల్ త్వరగా కోలుకోవాలని తాను ప్రార్థిస్తున్నానని అన్నారు. తనతో పాటు అందరూ కూడా అహ్మద్ పటేల్ కోలుకోవాలని ప్రార్థించాల్సిందిగా కోరారు.