1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : బుధవారం, 24 జూన్ 2015 (15:09 IST)

మెదడుకు ఆపరేషన్: రవీంద్రనాథ్ ఠాగూర్ పాటలు పాడిన యువతి...!

మెదడుకు ఆపరేషన్ జరుగుతుంటే.. ఆ యువతి రవీంద్రనాథ్ ఠాగూర్ పాటలు పాడుతూ డాక్టర్లకు పిచ్చెక్కించేలా చేసింది. అత్యంత క్లిష్టమైన బ్రెయిన్ ఆపరేషన్ జరుగుతుంటే పాటలు పాడటమే గాకుండా.. డాక్టర్లపై ప్రశ్నల వర్షం కురిపించింది. 
 
పశ్చిమ బెంగాల్‌లో ఈ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. పశ్చిమ బెంగాల్‌లోని బుర్ద్వాన్ ప్రాంతానికి చెందిన ఓ యువతికి బెంగళూరులోని సీతా బతేజా ఆసుపత్రిలో మెదడులోని కణితిని తొలగించే ఆపరేషన్ జరిగింది. దాదాపు మూడున్నర గంటల పాటు డాక్టర్లు ఈ ఆపరేషన్ చేయగా, ఆమె మెదడులోని సమాచార వ్యవస్థ పనిచేస్తూనే ఉంది. 
 
ఆపరేషన్ జరుగుతుంటే, తనకిష్టమైన రవీంద్రనాథ్ ఠాగూర్ పాటల్ని పాడిందట. అంతేగాకుండా డాక్టర్లను వారాల పేర్లు చెప్పండని ప్రశ్నించిందట. అంతటితో ఆగకుండా ఆపరేషన్ థియేటర్లో గల ఓ బొమ్మను ఏం కనిపిస్తోంది? ఒకటి నుంచి వంద వరకూ, వంద నుంచి ఒకటి వరకూ అంకెలు చెప్పండి? అంటూ ప్రశ్నలు సంధించిందట. ఇటువంటి ఘటనలు అరుదుగా జరుగుతాయని వైద్యులు చెబుతున్నారు. 
 
ఆపరేషన్ సమయంలో ఆమె మత్తులో లేదని ఆపరేషన్ నిర్వహించిన డాక్టర్ అరవింద్ చెప్పారు. మెదడులోని కణితి మాట్లాడే శక్తినిచ్చే భాగానికి అతిదగ్గరగా ఉండటంతో.. ఆపరేషన్ తర్వాత ఆమె మాట్లాడే శక్తిని కోల్పోకుండా ఉండేందుకు ఆపరేషన్‌కు ముందు కౌన్సిలింగ్ తీసుకుందని వివరించారు.