1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By PNR
Last Updated : గురువారం, 30 అక్టోబరు 2014 (09:21 IST)

నల్లధనం లిస్టులో కొత్త సమాచారమేమీ లేదు: సిట్‌ ఛైర్మన్

సుప్రీంకోర్టుకు కేంద్ర ప్రభుత్వం షీల్డు కవర్‌లో సమర్పించిన నల్లధన కుబేరుల జాబితాలో కొత్త సమాచారమేమీ లేదని ప్రత్యేత దర్యాప్తు బృందం (సిట్) ఛైర్మన్ జస్టీస్ ఎంబీ షా అన్నారు. కేంద్రం ఇచ్చిన జాబితాపై ఆయన స్పందిస్తూ ప్రభుత్వం సమర్పించిన జాబితాలో కొత్త సమాచారమేమీ లేదని, అందులోని వివరాలు ఇప్పటికే తమ వద్ద ఉన్నాయన్నారు. అందువల్ల ఈ కేసును ఆది నుంచి విచారించాల్సి ఉంటుందన్నారు. కొన్ని రోజులుగా జరుగుతున్న విచారణలో ఎలాంటి ఫలితమూ రాలేదని చెప్పారు. గడువులోగా తుది నివేదిక సమర్పిస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు. 
 
ఇదిలావుండగా, జెనీవాలోని హెచ్‌ఎస్‌బీసీ బ్యాంకులో నల్ల ధనాన్ని దాచిన 627 మంది భారతీయుల జాబితాను సీల్డ్‌ కవర్లో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ హెచ్‌ఎల్‌ దత్తు నేతృత్వంలోని సుప్రీం ధర్మాసనానికి కేంద్ర ప్రభుత్వం బుధవారం అందజేసిన విషయం తెల్సిందే. అయితే, ఆ కవర్‌ను ధర్మాసనం తెరవలేదు. సదరు సీల్డ్‌ కవర్‌ను తెరిచే అధికారాన్ని తాను నియమించిన ప్రత్యేక దర్యాప్తు సంస్థ (సిట్‌) ఛైర్మన్‌ ఎంబీ షా, వైస్‌ ఛైర్మన్‌ అరిజిత్‌ పసాయత్‌లకు సుప్రీం కోర్టు కట్టబెట్టింది. జాబితాను పరిశీలించి చట్టప్రకారం తగిన చర్యలు తీసుకోవాలని వారిని ఆదేశించింది.