1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : బుధవారం, 20 ఆగస్టు 2014 (16:09 IST)

యూపీఏ ప్రభుత్వ పథకాలనే కాపీ కొట్టారు: సోనియా గాంధీ

అభివృద్ధి పేరిట ప్రజలను మభ్యపెడుతున్నారని కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ఆరోపించారు. యూపీఏ ప్రభుత్వ పథకాలనే కాపీ కొట్టి అమలు చేస్తున్న నరేంద్ర మోడీ ప్రభుత్వం ఏవేవో చేసేస్తున్నామని అవాస్తవ ప్రచారం చేసుకుంటుందని సోనియా గాంధీ మండిపడ్డారు.
 
దివంగత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ 70వ జయంతి వేడుకలను పురస్కరించుకుని బుధవారం జరిగిన మహిళా కాంగ్రెస్ సమావేశంలో పాల్గొన్న సోనియా గాంధీ మాట్లాడుతూ.. మహిళా బిల్లును పార్లమెంటు, రాష్ట్రాల అసెంబ్లీల్లో ప్రవేశపెట్టి ఆమోదం పొందేలా నరేంద్ర మోడీ ప్రభుత్వంపై కాంగ్రెస్ పార్టీ తీవ్ర స్థాయిలో ఒత్తిడి తీసుకొస్తుందని చెప్పారు. 
 
ప్రజలకు తప్పుడు వాగ్ధానాలిచ్చి అధికారంలోకి వచ్చారని ఆరోపించారు. తమ ప్రభుత్వం ప్రజలకు ఎంతో చేసిందని ఆమె అన్నారు. కొంతమంది తమ ప్రభుత్వంపై దుష్ప్రచారం చేసి ఎన్నికల్లో గెలుపొందారని దుయ్యబట్టారు. బూటకపు కలలను అమ్మకుంటోందని కేంద్రంపై సోనియా ధ్వజమెత్తారు. 
 
2004లోనే కాంగ్రెస్ ప్రభుత్వం మహిళా బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టినప్పటికీ.. కొన్ని రాజకీయ పార్టీల అడ్డుకోవడం వల్లే ఆగిపోయిందని సోనియా గాంధీ చెప్పారు. తాము ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ మహిళా బిల్లు ఆమోదానికి కృషి చేస్తామని స్పష్టం చేశారు.