శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By PNR
Last Updated : ఆదివారం, 30 ఆగస్టు 2015 (15:09 IST)

కోటి ఉద్యోగాలు హుష్‌కాకి.. ఇపుడు ప్రత్యేక ప్యాకేజీనా? : మోడీపై సోనియా ధ్వజం

ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ధ్వజమెత్తారు. బీహార్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆ రాష్ట్ర రాజధాని పాట్నాలో ఆదివారం స్వాభిమాన్ సభను నిర్వహించారు. మహాకూటమి ఆధ్వర్యంలో జరిగిన ఈ సభలో సోనియాతో పాటు బీహార్ ముఖ్యంత్రి నితీష్ కుమార్, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
 
ఈ సందర్భంగా ఆమె ప్రసంగిస్తూ దేశంలో కోటి ఉద్యోగాలు కల్పిస్తామని మోడీ ఇచ్చిన హామీ ఏమైందని ప్రశ్నించారు. ఎన్నికల సందర్భంగా ప్రజలను మభ్యపెట్టేందుకు ఎన్డీయే అనేక హామీలు ఇచ్చిందని, అధికారంలోకి వచ్చాక ఆ హామీలను తుంగలో తొక్కారని ఆమె ధ్వజమెత్తారు. 
 
యువతకు భరోసా లభించడంలేదని, వారిప్పుడు ఉపాధి కరవై రోడ్డున పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల ఆర్థిక పరిస్థితి దిగజారిపోతోందని అన్నారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని చిత్తుగా ఓడించాలని పిలుపునిచ్చారు. 
 
బీహార్‌కు ప్రత్యేక ప్యాకేజీ కాదని, ప్రత్యేక హోదా కావలన్నారు. పైగా ఇటీవల ప్రకటించిన ప్రత్యేక ప్యాకేజీ కేవలం కంటి తుడుపు చర్యేనని ఆమె ఆరోపించారు. ఈ ప్యాకేజీపై స్పష్టత లేదని సోనియా గుర్తు చేశారు.