ఆదివారం, 12 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 13 జనవరి 2021 (08:52 IST)

సోనూసూద్‌ నేరాలకు అలవాటు పడిన వ్యక్తి.. బీఎంసీ ఫైర్

కరోనా వైరస్ నేపథ్యంలో వలస కార్మికులకు బాలీవుడ్‌ నటుడు సోనూసూద్‌ అండగా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సోనూసూద్‌ నేరాలకు అలవాటు పడిన వ్యక్తి అని బృహన్‌ ముంబయి మునిసిపల్‌ కార్పోరేషన్‌ (బిఎంసి) అనుచిత వ్యాఖ్యలు చేసింది. సబర్బన్‌లోని జుహూలో అనధికారికంగా నిర్మాణ పనులు చేపట్టాడని, గతంలో రెండుసార్లు కూల్చివేసినప్పటికీ.. మరలా నిర్మాణం ప్రారంభించాడని ముంబయి కోర్టుకు సమర్పించిన అఫిడవిట్‌లో బిఎంసి పేర్కొంది.
 
సోనూసూద్‌ తన నివాసంలో అక్రమ కట్టడాలు చేపడుతున్నారని ఆరోపిస్తూ.. గత ఏడాది అక్టోబర్‌లో బిఎంసి తనకు ఇచ్చిన నోటీసులను సవాలు చేస్తూ.. గతవారం ఆయన ఒక పిటిషన్‌ను దాఖలు చేశారు. దీన్ని సివిల్‌ కోర్టు తిరస్కరించడంతో ఆయన హైకోర్టును ఆశ్రయించారు. దీనికి ప్రతిస్పందనగా బిఎంసి ఈ అఫిడవిట్‌ను కోర్టుకు సమర్పించింది.
 
ఆరు అంతస్థుల నివాస భవనం 'శక్తిసాగర్‌'ను హోటల్‌గా మారుస్తున్నారని బిఎంసి తన నోటీసులో పేర్కొంది. సోనూ సూద్‌ నేరాలకు అలవాటు పడ్డ వ్యక్తి అని .. అనధికారిక కట్టడాలను నగర పాలక సంస్థ రెండుసార్లు కూల్చివేసినా ఆయన తన పద్ధతి మానుకోలేదని బిఎంసి పేర్కొంది.