పురుషాధిక్యంపై సుప్రీం సీరియస్.. సమానత్వం బూటకం..!
పురుషాధిక్యంపై దేశ అత్యున్నత న్యాయస్థానం తీవ్రస్థాయిలో మండిపడింది. 'ఇది పురుషుల కోసం పురుషులు నిర్మించిన సమాజం. ఇక్కడ సమానత్వం గురించి మాట్లాడటం బూటకం అవుతుంది. ఈ నేపథ్యంలోనే దేశానికి స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచీ స్త్రీ, పురుషుల మధ్య ఉన్న అంతరాలను తొలగించడానికి ప్రయత్నాలు సాగుతున్నాయి' అంటూ సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది.
శాశ్వత కమిషన్‌లో తమకు చోటు కల్పించాలని చేసుకొన్న దరఖాస్తును ఆర్మీ తిరస్కరించడంపై కొంత మంది మహిళా సైనిక అధికారులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. వీరి పిటిషన్లపై ధర్మాసనం గురువారం విచారణ జరిపింది. సైన్యంలో కూడా మహిళలపై వివక్ష కొనసాగుతున్నదని ఈ సందర్భంగా అభిప్రాయపడింది.
మహిళా అధికారులకు శాశ్వత కమిషన్‌ను మంజూరు చేయడానికి ప్రవేశపెట్టిన వార్షిక రహస్య నివేదిక మందిపు ప్రక్రియలో వ్యవస్థీకృత వివక్ష దాగి ఉన్నదని పేర్కొన్నది. ఫిట్‌నెస్ పరీక్షలో పురుషులతో పోల్చడం అహేతుకమని కోర్టు వ్యాఖ్యానించింది. గతేడాది సెలక్షన్ బోర్డు పరీక్షల్లో 60 శాతం మార్కులు దాటిన వారికి శాశ్వత కమిషన్‌లో చోటు కల్పించాలని తీర్పునిచ్చింది. ఏసీఆర్‌ను పక్కనపెట్టాలని ఆదేశించింది.