1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By CVR
Last Updated : మంగళవారం, 30 జూన్ 2015 (12:53 IST)

తీహార్ జైల్లో సొరంగం తవ్వి.... ఇద్దరు ఖైదీలు పరార్...

భద్రతకు మారుపేరుగా ఉన్న తీహార్ జైలులో సొరంగం తవ్వుకుని ఇద్దరు ఖైదీలు తప్పించుకున్నారు. దక్షిణ ఆసియాలోనే అతిపెద్ద జైలుగా ప్రసిద్ధి చెందినది తీహార్ జైలు. ఈ జైలులో 24 గంటలు అధికారులు అలెర్ట్‌గా ఉంటారు. ఈ జైలు నుంచి అధికారులకు తెలియకుండా ఎవరూ లోపలికి వెళ్లడమో, లేక బయటికి రావడం జరగదు. 
 
ఇంతటి భద్రతతో కూడిన ఈ జైలు నుంచి ఇద్దరు ఖైదీలు తప్పించుకుని పారిపోవడంతో దిగ్భ్రాంతికి గురిచేస్తోంది. ఈ జైలులో ఉన్న జైలు నెం 7లో ఫైజన్, జావిద్ అనే ఇద్దరు విచారణ ఖైదీలు గత కొన్ని నెలలుగా బంధించబడి ఉన్నారు. వీరిద్దరు శనివారం అర్ధరాత్రి జైలు ప్రాంగణంలోని ఎనిమిదో నెంబరు భవన వద్ద నుంచి అవతలి వైపుకు సొరంగం తవ్వి, ఆ మార్గంలో అక్కడి నుంచి తప్పించుకుని పారిపోయినట్లు తెలుస్తోంది.
 
తర్వాత రోజు ఆదివారం రాత్రి అందరు ఖైదీలు అటెండెన్స్ కోసం హాలులోకి రాగా.. ఈ ఇద్దరు మాత్రం హాజరుకాలేదు. దీంతో అనుమానం వచ్చిన జైలు సిబ్బంది వారి సెల్‌కు వెళ్లి చూడా.. అక్కడ వారు కనిపించలేదు. అయితే పక్కనే ఉన్న ఎనిమిదో నెంబరు భవనంలో పెద్ద సొరంగం కనబడింది. అది జైలులోపలి నుంచి సరిగ్గా ప్రహారీ ఆవలికి దారితీసి ఉంది. ఖైదీల పరారీపై జైలు అధికారుల సమాచారంతో అప్రమత్తమైన ఢిల్లీ పోలీసులు రంగంలోకి దిగారు. 
 
దీంతో ఎట్టకేలకు ఫైజన్‌ను పట్టుకోగలిగినప్పటికీ జావేద్ మాత్రం తప్పించుకున్నాడు. అయితే ఈ ఘటనపై వివరాలు చెప్పేందుకు అధికారులు నిరాకరించారు. ఫైజన్ కోసం తీవ్రంగా గాలిస్తున్నారు.