మంగళవారం, 31 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 8 డిశెంబరు 2023 (15:40 IST)

ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీంకోర్టులో తీర్పు ఎపుడంటే...

supreme court
జమ్మూకాశ్మీరుకు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించిన రాజ్యాంగంలోని ఆర్టికల్ 370 రద్దును సవాల్ చేస్తూ దాఖలైన పలు పిటిషన్లపై ఈ నెల 11వ తేదీన సుప్రీంకోర్టు తుది తీర్పును వెలువరించనుంది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చంద్రచూడ్ ఆధ్వర్యంలో జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్, సంజీవ్ ఖన్నా, బీఆర్ గవాయ్, సూర్య కాంత్‌లతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం తీర్పు వెలువరిస్తుంది. సెప్టెంబరులో ఈ పిటిషన్లపై విచారణ ముగియడంతో సుప్రీంకోర్టు తీర్పు రిజర్వ్ చేసిన విషయం తెలిసిందే. ఆర్టికల్ 370 రద్దుకు సంబంధించిన పిటిషన్‌పై మొత్తం 16 రోజుల పాటు సుప్రీంకోర్టు వాదనలు ఆలకించింది. 
 
కేంద్ర ప్రభుత్వం తరపున అటార్నీ జనరల్ ఆర్.వెంకటరమణి, సాలిసిటర్ జనరల్ తుషార్ మెహతా, సీనియర్ న్యాయవాదులు హరీశ్ సాల్వే, రాకేశ్ ద్వివేదీ, వి.గిరి వాదనలు వినిపించారు. జమ్ముకాశ్మీర్ కాంస్టిట్యూయెంట్ అసెంబ్లీ రద్దు తర్వాత ఆర్టికల్ 370 శాశ్వతమైనదిగా మారిందని పిటిషనర్ల తరపు న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. రాజ్యాంగ సవరణలకు అవకాశం కల్పించే ఆర్టికల్ 368 ద్వారా ఆర్టికల్ 370ని రద్దు చేయలేమని స్పష్టం చేశారు. ఆర్టికల్ 370 తాత్కాలికమైన అధీకరణ అని పేర్కొంది. 
 
జమ్మూకాశ్మీర్‌ను దేశంలో పూర్తిగా ఐక్యం చేసేందుకు ఆర్టికల్ 370 రద్దు అనివార్యమైన ఆఖరి చర్య అని చెప్పుకొచ్చింది. ప్రత్యేకహోదా తొలగింపు తర్వాత కాశ్మీర్‌లో చోటుచేసుకున్న సానుకూల పరిణామాలు కూడా కోర్టు ముందుంచింది. ఇరు పక్షాలవాదనలు ఆలకించిన సుప్రీంకోర్టు తీర్పును రిజర్వు చేసింది. 2019 ఆగస్టు 5న బీజేపీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం ఆర్టికల్ 370ని రద్దు చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత రాష్ట్రాన్ని జమ్మూకాశ్మీర్, లడ్డాఖ్ కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించింది. జమ్మూకాశ్మీర్‌కు అసెంబ్లీ ఉన్నా లడ్డాఖ్ మాత్రం శాసనసభ లేని కేంద్రపాలిత ప్రాంతంగా కొనసాగుతున్న విషయం తెల్సిందే.