గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : గురువారం, 10 ఆగస్టు 2017 (13:44 IST)

శశికళ, దినకరన్‌కు షాక్‌.. పార్టీ నుంచి గెంటివేత?... పళనిస్వామి తీర్మానం

తమిళనాడు అధికార అన్నాడీఎంకే పార్టీ రాజకీయాల్లో కీలక మలుపు చోటుచేసుకుంది. అన్నాడీఎంకే పార్టీ నుంచి శశికళ, దినకరన్‌లను పూర్తిగా సాగనంపేందుకు రంగం సిద్ధమైంది. పార్టీ ఉప ప్రధాన కార్యదర్శిగా ఉన్న దినకరన్ న

తమిళనాడు అధికార అన్నాడీఎంకే పార్టీ రాజకీయాల్లో కీలక మలుపు చోటుచేసుకుంది. అన్నాడీఎంకే పార్టీ నుంచి శశికళ, దినకరన్‌లను పూర్తిగా సాగనంపేందుకు రంగం సిద్ధమైంది. పార్టీ ఉప ప్రధాన కార్యదర్శిగా ఉన్న దినకరన్ నియామకం చెల్లదంటూ తీర్మానం చేశారు. అలాగే, శశికళను కూడా ఇంటికి సాగనంపేలా చర్యలు తీసుకోనున్నారు. 
 
ఇప్పటికే అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళ నియామకం కూడా సక్రమంగా లేదని ఈసీ స్పష్టం చేసిన విషయం తెల్సిందే. ఈ నేపథ్యంలో గురువారం సీఎం పళనిస్వామి సారథ్యంలోని పార్టీ నేతలంతా సమావేశమై దినకరన్‌ను ఉప ప్రధాన కార్యదర్శి పదవి నుంచి తప్పిస్తూ తీర్మానం చేశారు. తద్వారా తిరుగుబాటు వర్గం మాజీ ముఖ్యమంత్రి ఓ పన్నీర్ సెల్వంతో చేతులు కలిపేందుకు మార్గం సుగమం చేశారు. 
 
అక్రమాస్తుల కేసులో శశికళ జైలుకు వెళ్లడం, ఆమె వారసుడిగా తెరపైకి వచ్చిన దినకరన్‌ ఎన్నికల గుర్తు కేసులో అరెస్టవ్వడంతో అధికార అన్నాడీఎంకేలో సమీకరణలు మారిపోయాయి. శశికళ అనుచరుడిగా సీఎం పదవి చేపట్టిన ఎడపాడి పళనిస్వామి (ఈపీఎస్‌) పార్టీపై పూర్తి పట్టుసాధించారు. మరోవైపు అన్నాడీఎంకేలో మరో కీలక వర్గంగా మారిన మాజీ సీఎం ఓ. పన్నీర్‌ సెల్వం (ఓపీఎస్‌)తో చేతులు కలిపి.. పార్టీని పటిష్ట పరుచుకోవడం, తన అధికారాన్ని సుస్థిరపరుచుకోవాలని ఉవ్విళ్లూరుతున్నారు. 
 
అయితే, పళనిస్వామితో చేతులు కలపాలంటే శశికళను, దినకరన్‌ను పార్టీ నుంచి తొలగించాలని పన్నీర్‌ సెల్వం డిమాండ్‌ చేస్తున్న సంగతి తెలిసిందే.  అన్నాడీఎంకేలో కీలకంగా ఉన్న ఈపీఎస్‌-ఓపీఎస్‌ వర్గాల విలీనానికి రంగం సిద్ధమవుతున్న సమయంలో బెయిల్‌పై జైలు నుంచి బయటకు వచ్చిన దినకరన్‌ మళ్లీ అలజడి రేపారు. అన్నాడీఎంకే పార్టీ శశికళదేనని, ఆమె స్థానంలో తానే పార్టీ అధినేతనంటూ ప్రకటనలు ఇచ్చారు. ఆయనకు పలువురు అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు మద్దతు పలికారు. 
 
ఈ నేపథ్యంలో అన్నాడీఎంకేను స్వాధీనం చేసుకుంటానని దినకరన్‌ చేసిన ప్రకటనలు ఈపీఎస్‌-ఓపీఎస్‌ వర్గాల్లో కలకలం రేపాయి. ఈ క్రమంలోనే దినకరన్‌పై వేటు వేస్తూ ఈపీఎస్‌ వర్గం నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంతో ఈపీఎస్‌-ఓపీఎస్ వర్గాల విలీనానికి మార్గం సుగమం అయినట్టు భావిస్తున్నారు.
 
అదేసమయంలో అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శిగా ఓ పన్నీర్ సెల్వంను ఎన్నుకునే అవకాశం ఉంది. అలాగే, ఆయనకు ఉప ముఖ్యమంత్రి పదవితో పాటు.. గతంలో ఆయన నిర్వహిస్తూ వచ్చిన ప్రజాపనులు, ఆర్థిక శాఖలను కూడా తిరిగి అప్పగించే సూచనలు కనిపిస్తున్నాయి. అలాకాని పక్షంలో కేంద్ర మంత్రివర్గంలో ఓ.పన్నీర్ సెల్వంకు చోటు కల్పించనున్నారనే వార్తలు వస్తున్నాయి.