శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : గురువారం, 9 ఫిబ్రవరి 2017 (11:56 IST)

పన్నీర్ సెల్వం దూకుడు.. పోలీస్ కమిషనర్ బదిలీ.. పార్టీ ఖాతాల్లో డబ్బు తీస్తే తాటతీస్తా..!

తమిళనాడు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీర్‌ సెల్వం పరిపాలన పరంగా జోరు పెంచారు. ఇన్నాళ్లు మౌనాన్నే అస్త్రంగా ప్రయోగించిన పన్నీర్ సెల్వం.. ప్రస్తుతం ఆ అస్త్రాన్ని దూకుడుగా మార్చుకున్నారు. అన్నాడీఎంకే ప్రధాన

తమిళనాడు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీర్‌ సెల్వం పరిపాలన పరంగా జోరు పెంచారు. ఇన్నాళ్లు మౌనాన్నే అస్త్రంగా ప్రయోగించిన పన్నీర్ సెల్వం.. ప్రస్తుతం ఆ అస్త్రాన్ని దూకుడుగా మార్చుకున్నారు. అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళను టార్గెట్ చేశారు. ఆమెను సీఎం పీఠంపై కూర్చోనివ్వకుండా చేయాలని పన్నీర్ కంకణం కట్టుకున్నారు. శశికళ చేతిల్లో అన్నాడీఎంకే పార్టీ నలిగిపోకుండా ఉండేందుకు పన్నీర్ ఒంటరి పోరు చేస్తున్నారు. ఇందుకు ఎమ్మెల్యేల మద్దతు కూడా లభిస్తూనే ఉన్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. 
 
ఈ నేపథ్యంలో చెన్నై నగర పోలీస్‌ కమిషనర్‌ను బదిలీ చేయాలని తమిళనాడు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీర్‌ సెల్వం ఆదేశించారు. గురువారం తన కార్యాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీలతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా చెన్నై కమిషనర్‌ను బదిలీపై పంపాలని పన్నీర్‌ ఆదేశాలు జారీచేశారు. మరోవైపు అన్నాడీఎంకే పార్టీకి తానే కోశాధికారినని, తన అనుమతి లేకుండా పార్టీ ఖాతాల్లోని డబ్బు తీసుకోవడానికి అనుమతి లేదని కూడా పన్నీర్ సెల్వం స్పష్టం చేశారు. 
 
అన్నాడీఎంకే పార్టీ తాత్కాలిక ప్రధాన కార్యదర్శి శశికళ ఆయనను కోశాధికారి పదవి నుంచి తొలగించారు. అయితే పార్టీ నిబంధనల ప్రకారం తన తొలగింపు అక్రమమని, తాను ఇంకా పార్టీ కోశాధికారినని పన్నీర్‌ పేర్కొన్నారు. తన అనుమతి లేకుండా పార్టీ ఖాతాల్లో నిధులు వాడడానికి ఎవరినీ అనుమతించొద్దని కరూర్‌ వైశ్యా బ్యాంక్‌, బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా చీఫ్‌ మేనేజర్లకు లేఖలు పంపించారు. 
 
ఇదిలా ఉంటే.. గురువారం శశికళ-పన్నీర్ సెల్వం మధ్య జరుగుతున్న రసవత్తర రాజకీయాలకు తెరపడే అవకాశం కనిపిస్తోంది. గురువారం ఇరు పక్షాల బలనిరూపణ జరిగితేనే రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ అనిశ్చితికి తెరపడే అవకాశం ఉంది. శశికళ వెంట 130 మంది అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు ఉన్న సంగతి తెలిసిందే. పన్నీర్‌ వైపు కేవలం ముగ్గురు మాత్రమే ఉన్నట్లు తెలుస్తోంది. అయితే బలనిరూపణ సమయానికి ఎమ్మెల్యేలు తనవైపు వస్తారని పన్నీర్‌ నమ్ముతున్నారు. మరి ఎమ్మెల్యేలు ఏం చేస్తారో చూడాలి..